కష్టపడి.. ఉన్నత శిఖరాలకు..
స్వర్ణాల చెరువు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): అనారోగ్యం ఆమెను యోగా వైపు అడుగులు వేయించింది. సమస్య పరిష్కారమయ్యాక దానిని విడిచి పెట్టలేదు. కెరీర్‌గా మార్చుకుని శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తోంది.
పబ్బులేటి పద్మావతిది వైఎస్సార్ జిల్లాలోని మాధవరం. విద్యాభ్యాసమంతా అక్కడే గడించింది. ఆమె సైనస్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడేది. ఈ క్రమంలో అన్న ప్రకాష్ నారాయణ సూచన మేరకు యోగా సాధన మొదలుపెట్టింది. అయితే అవగాహన లేమితో అది ముందుకు సాగలేదు. ఈ సమయంలో నెల్లూరుకు చెందిన బాలాజీ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత పద్మావతి పూర్తిగా యోగా సాధన ప్రారంభించారు. అవినాష్, అభిలేష్ అనే కుమారులున్నా యోగాకు మాత్రం దూరం జరగలేదు. కష్టపడటంతో అనారోగ్య సమస్య తగ్గింది. దీంతో యోగాలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నిర్ణయించుకుని ముందుకు సాగింది. 2010వ సంవత్సరంలో భగవద్గీత, యోగా పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. యోగాలో వివిధ కోర్సులు పూర్తి చేసి శిక్షకురాలిగా మారారు. బ్రెయిన్ యోగా, ట్రస్ట్ మేనేజ్‌మెంట్ యోగా తదితర కోర్సులను చేశారు. మహిళలకు తరచూ ప్రసవం తర్వాత వచ్చే ఆరోగ్య సంబంధిత సమస్యలకు యోగా చక్కని జవాబు చెబుతుందని పలువురిని ప్రేరేపించి సాధన చేయిస్తున్నారు.
రాణిస్తూ..
పద్మావతి యోగాలో పలువురికి శిక్షణ ఇస్తూనే పోటీల్లో రాణిస్తున్నారు. ప్రసంశలు అందుకున్నారు. ఉత్తమ శిక్షకురాలిగా 2018లో అప్పటి కలెక్టర్ ముత్యాలరావు చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. 2021లో పతంజలి కాలేజ్ ఆఫ్ యోగా, రీసెర్చ్ సెంటర్ వారు ఉత్తమ యోగా శిక్షకురాలిగా ప్రశంసాపత్రాన్ని ఇచ్చారు.
చాలా మంచిది
యోగా సాధన చాల మంచిది. విద్యార్థులు తప్పనిసరిగా చేయాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నా దగ్గర శిక్షణ తీసుకునే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించడమే లక్ష్యం. నేటి ఉరుకుల, పరుగుల ప్రపంచంలో చిన్నప్పటి నుంచి యోగా సాధన చేయడం ఎంతో ముఖ్యం.
– పద్మావతి
యోగాలో రాణిస్తున్న నెల్లూరు మహిళ
గురువుగా ఎందరికో శిక్షణ
పోటీల్లోనూ ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment