సోమిరెడ్డీ.. దమ్ముంటే నాతో పోరాడు
వెంకటాచలం: ‘సోమిరెడ్డి అసమర్ధుడు. రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి నీచ రాజకీయాలు చేసే బఫూన్. ఇలాంటోడు చెప్పాడని పోలీసులు తప్పుడు పనులకు పాల్పడుతున్నాడు. రాజకీయంగా ఎదుగుతున్న వైఎస్సార్‌సీపీ బీసీ నేత, మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్యను ఎదుర్కొనే శక్తి సోమిరెడ్డికి లేకపోవడంతోనే మహిళను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసు నమోదు చేయించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం కాకాణి వెంకటాచలంలోని వెంకటశేషయ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కాకాణి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులపై అక్రమ కేసు నమోదు చేయించి జైలు పాలు చేసి కక్ష సాధింపులకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీలో చురుకై న నేతగా పేరు తెచ్చుకున్న వెంకటశేషయ్యను రాజకీయంగా ఎదుర్కొనలేక సోమిరెడ్డి అక్రమ కేసులు బనాయించాడని ఆరోపించారు. ఐదు సార్లు ఓటమికి కారణాలను వెతుక్కోకుండా వైఎస్సార్‌సీపీలో గట్టిగా పనిచేసే నాయకులపై అక్రమ కేసులు మోపడం, కొందరిని పోలీసులతో కొట్టించడం వంటి ఆలోచనలు సోమిరెడ్డి చేయడం సిగ్గు చేటన్నారు.
సీఐ సుబ్బారావు అవినీతి పరుడు
వెంకటాచలం సీఐ సుబ్బారావు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాల వద్ద భారీ వసూళ్లకు పాల్పడుతున్నాడనే విషయాన్ని తాను స్వయంగా డీఎస్పీని కలిసి చెప్పడం జరిగిందన్నారు. తన అవినీతి, అక్రమాలకు సోమిరెడ్డి అండగా నిలువడం కోసమే ఆయన చెప్పిన ప్రతి పనిని సీఐ సుబ్బారావు చేస్తున్నారని ఆరోపించారు. వెంకట శేషయ్యపై నమోదు చేయించిన అక్రమ కేసుకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని కోర్టులో పొందుపరిచారని చెప్పారు. వెంకటాచలంలోని పెంచలయ్య, వెంకటమ్మ ఈ నకిలీ డాక్యుమెంట్లు సీఐకు ఇచ్చారని ధ్రువీకరిస్తూ ఆర్‌ఐ రవికుమార్ సంతకం చేసిన పత్రాన్ని కోర్టులో పొందుపరచడం జరిగిందన్నారు. అయితే ఆర్‌ఐ రవికుమార్ వెంకటాచలం రాకుండానే తప్పుడు సంతకం పెట్టాడని, వెంకటాచలంలో సీసీ పుటేజ్‌లు ఓపెన్ చేసి విచారణ జరిపితే వాస్తవాలు తేలుతాయన్నారు.
న్యాయపోరాటం చేస్తాం
కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగే దాడులు, అక్రమ కేసులు, జైళ్లకు పంపడంపై న్యాయ పోరాటాలు చేస్తామని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు జరిగే అన్యాయాలపై ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని, వారికి అండగా నిలవడం కోసమే పని చేస్తానన్నారు. మహిళలంటే తమ అధినేతకు, తమకు ఎంతో గౌరవమని చెప్పారు. అయితే అమాయక మహిళను అడ్డం పెట్టుకుని మాజీ జెడ్పీటీసీ వెంకటశేషయ్యను జైలుకు పంపడం దుర్మార్గమని మండి పడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చేసే పాపాలు.. భవిష్యత్‌లో శాపాలుగా మారుతాయని హెచ్చరించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందాననే అనుమానాలు జిల్లా ప్రజలకు కలుగుతున్నాయన్నారు. జిల్లా ఎస్పీ మౌనంగా ఉండడంతో ప్రతి స్టేషన్‌లో సీఐ, ఎస్‌ఐలు ఎస్పీలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంకట శేషయ్యపై అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపడంతో అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చాలా బాధపడుతున్నారని, అయితే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటశేషయ్యకు జైలుకు పంపిన కేసులో భాగమైన ప్రతి ఒక్కరూ అంతకు రెండింతలు బాధపడేలా చేస్తామని హెచ్చరించారు. ఇలా జరగకపోతే తన పేరును మార్చుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కొణిదెన మోహన్‌నాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు కొణిదెన విజయభాస్కర్‌నాయుడు, ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, మందల పెంచలయ్య, అడపాల ఏడుకొండలు, వెలిబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కక్ష సాధింపులకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదు
తప్పుడు నాయకుడు మాటలు వినే
పోలీసులకు శిక్ష తప్పదు
రాజకీయంగా ఎదుర్కొలేక
వెంకటశేషయ్యపై అక్రమ కేసు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
వెంకటశేషయ్య కుటుంబ సభ్యులకు పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment