తిరగలేకున్నాం ‘బాబూ..’ | - | Sakshi
Sakshi News home page

తిరగలేకున్నాం ‘బాబూ..’

Published Fri, Dec 27 2024 7:28 PM | Last Updated on Fri, Dec 27 2024 8:05 PM

నెల్లూరులో వినతపత్రాలు స్వీకరిస్తున్న ఉన్నతాధికారులు (ఫైల్)

నెల్లూరులో వినతపత్రాలు స్వీకరిస్తున్న ఉన్నతాధికారులు (ఫైల్)

ప్రజా సమస్యల పరిష్కారానికి నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేసింది. జిల్లా కేంద్రం, మండలాల్లోని కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం పక్కాగా జరిగింది. చాలా సమస్యలపై అక్కడికక్కడే చర్యలు తీసుకునే వారు. పరిష్కరించే స్థితి లేనివాటిపై కలెక్టరేట్‌కు వెళ్లేవారు. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు మారిపోయాయి. స్పందన పేరు మార్చింది. కానీ వినతులను ఆశించిన స్థాయిలో పట్టించుకోవడం లేదు. మండలాల్లోనే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశిస్తున్నా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

నెల్లూరు రూరల్‌: కూటమి ప్రభుత్వంలో ప్రజల కష్టాలు వర్ణానాతీతంగా ఉన్నాయి. చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రతి సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వందల సంఖ్యలో వినతిపత్రాలు వస్తున్నాయి. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్పందన కార్యక్రమం పక్కాగా జరిగింది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలు, మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో వినతులు స్వీకరించి చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

ఇప్పుడిలా..

ప్రజల బాధలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు. సర్కారు పెద్దలు దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ సమస్యల పరిష్కారంపై పెట్టడం లేదని విమర్శలున్నాయి. మండలాల్లోనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. చిన్న చిన్న సమస్యలపై వినతులు జిల్లా కేంద్రానికి రాకుండా చూడాలన్నారు. కానీ కొందరు అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి సోమవారం ఒక్కో మండలంలో ఐదారు అర్జీలకు మించి రావడం లేదంటే మొక్కుబడిగా జరుపుతున్నారని అర్థమవుతోంది. చాలామంది కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి పెద్దగా స్పందన లేదని భావించిన జనం ప్రతి సోమవారం అష్టకష్టాలు పడుతూ నెల్లూరుకు చేరుకుని గంటల తరబడి ఎదురుచూసి వినతులు ఇస్తున్నారు. ఇందులో ఎక్కువగా రెవెన్యూ శాఖవే వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. వినతుల్లో ఆ తర్వాతి స్థానం మున్సిపల్‌ శాఖదే. పంచాయతీరాజ్‌వి కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.

ఎన్నిసార్లు చెబుతున్నా..

మరోవైపు కలెక్టర్‌, ఉన్నతాధికారులు వినతులు పరిష్కరించాలని, పునరావృతం కాకూడదని పదేపదే సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టి మండలాధికారులను ఆదేశిస్తున్నారు. కానీ వారు బేఖాతరు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఈ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలను నిర్వీ ర్యం చేస్తోంది. దీంతో పల్లెల్లో చిన్న, చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. డ్రెయినేజీ, రోడ్డు సమస్యలను చెప్పేందుకు జిల్లా కేంద్రానికి జనం వస్తున్నారు. నవంబర్‌ నెలలో 4వ తేదీన అత్యధికంగా 399, 11న 350 వినతిపత్రాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చాయి. ఈ సర్కారు ఏదో ఒక కారణం చెప్పి ప్రతినెలా పింఛన్లను తీసేస్తోంది. దీంతో వృద్ధులు, దివ్యాంగులు వ్యయప్రయాసలకోర్చి వస్తున్నారు. జిల్లా అధికారులు అప్పుడప్పుడు వేదిక కార్యక్రమానికి డుమ్మా కొట్టి కింది స్థాయి అధికారులను పంపుతున్నారని విమర్శలున్నాయి.

అవే అధికంగా..

మండలాల్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం నెలకొంది. అందుకే చాలామంది జిల్లా కేంద్రానికి పరుగులు పెడుతున్నారు. భూ వివాదాలు, హద్దులు, ఆక్రమణలు తదితరాలపైనే వినతులు అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతో హడావుడి చేస్తుంది. వాటిల్లో పదుల సంఖ్యలో కూడా అర్జీలు రావడం లేదు. వాటిపై చర్యలు తీసుకోవడం లేదని కలెక్టరేట్‌లో వస్తున్న వినతుల సంఖ్యను చూస్తే తెలుస్తోంది. దీంతో సదస్సులతో ఉపయోగం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాలు ఎక్కువయ్యాయి. దీనికి సంబంధించి అర్జీలు కూడా పెద్దఎత్తున వస్తున్నాయి.

ఇటీవల శాఖల వారీగా చూస్తే..

డిసెంబర్‌ 2న 212 వినతులందాయి. ఇందులో రెవెన్యూ శాఖవి 95, మున్సిపల్‌ శాఖవి 23, సర్వే శాఖవి 13, పంచాయతీరాజ్‌ శాఖవి 11, సివిల్‌ సప్లయీస్‌వి 11, ఇరిగేషన్‌ శాఖవి 10, పోలీస్‌ శాఖవి 6, పంచాయతీరాజ్‌వి 5 తదితరాలున్నాయి.

9న 256 వినతులందాయి. ఇందులో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 130, మున్సిపల్‌ శాఖకు 22, సర్వేకు 12, పంచాయతీరాజ్‌కు 17, సివిల్‌ సప్లయిస్‌ 7 వినతులు, మరికొన్ని అందుకున్నారు.

16న వివిధ శాఖలకు సంబంధించి 244 వినతిపత్రాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూ శాఖవి 120, మున్సిపల్‌ శాఖవి 16, సర్వేవి 16, పంచాయతీరాజ్‌ శాఖవి 19, సివిల్‌ సప్లయీస్‌వి 12, ఇతర శాఖల వినతులొచ్చాయి.

23న 263 వినతులు రాగా అందులో రెవెన్యూ శాఖవి 127, మున్సిపల్‌ శాఖవి 21, సర్వేవి 12, పంచాయతీరాజ్‌ శాఖవి 16, సివిల్‌ సప్లయీస్‌వి 7 తదితర శాఖలవి ఉన్నాయి.

మండలాల్లో ఇదీ పరిస్థితి

● జలదంకిలోని రెవెన్యూ కార్యాలయంలో ఈనెల 23వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. దీనికి వివిధ శాఖల సిబ్బంది డుమ్మా కొట్టారు. ఉదయం 11 గంటలకు తహసీల్దార్‌ ప్రమీల ఒక్కరే కనిపించారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ, ఏపీఓ, ఏపీఎంలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన శాఖల అధికారులు రాలేదు. వినతిపత్రాలు ఇవ్వాలని వెళ్లిన ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.

● బుచ్చిరెడ్డిపాళెంలో 16వ తేదీన ఒక్క వినతిపత్రం మాత్రమే వచ్చింది. 23న తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై రెండు వినతులు మాత్రమే అందాయి. అవి కూడా రెవెన్యూ శాఖవే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement