దండయాత్ర
ఇసుక దందాపై
అడ్డుకున్న పీకేపాడు గ్రామస్తులు
సోమశిల: ఇసుక మాఫియాపై పీకేపాడు గ్రామస్తులు దండయాత్ర చేశారు. అనంతసాగరం మండలంలోని పడమటికంభంపాడు రీచ్ నుంచి నిత్యం రాత్రి వేళల్లో అక్రమంగా సాగిస్తున్న ఇసుక రవాణాపై గ్రామస్తులు కన్నెర్ర చేశారు. మంగళవారం రాత్రి కొందరు గ్రామస్తులు రీచ్ వద్దకు చేరుకుని ఇసుక రవాణా చేస్తున్న వాహనాలతోపాటు తవ్వకాలను చేస్తున్న యంత్రాలను అడ్డుకున్నారు. రేయింబవళ్లు ఇసుక రవాణా చేయడాన్ని తాము అడ్డుకుంటే.. ఆపినట్లే ఆపి మళ్లీ ఇష్టారాజ్యంగా రవాణా చేస్తున్నారంటూ గ్రామస్తులు మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేయడంతో మా ఊరు రోడ్డు ధ్వంసం అవుతుందని, స్థానికంగా ఉన్న కూలీలకు కనీసం పని కూడా కల్పించకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మంగళవారం రాత్రి రెండు పొక్లెయినర్లు పెట్టి పదికిపైగా టిప్పర్లకు ఇసుక లోడింగ్ చేస్తున్నట్లు సమాచారంతో రీచ్ వద్దకు వచ్చామన్నారు. ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఇసుక మాఫియా దగ్గర లంచాలు తీసుకుంటూ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రకృతి సంపదను కొందరికి దోచిపెడుతున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న ఇసుక దోపిడీని ఇక సహించబోమన్నారు. పగలు ట్రాక్టర్లు, రాత్రిళ్లు టిప్పర్లు పెట్టి ఇసుక దోచుకుపోతూ.. కనీసం గ్రామస్తుల్లోని కూలీలకు పని కల్పించడం లేదన్నారు. ఇకనైనా ఇసుక అక్రమ రవాణాను ఆపడంతోపాటు నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో కూలీలకు పనులు కల్పించాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment