వన్‌మ్యాన్‌ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన రేపు | - | Sakshi
Sakshi News home page

వన్‌మ్యాన్‌ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన రేపు

Published Fri, Jan 3 2025 12:52 AM | Last Updated on Fri, Jan 3 2025 12:51 AM

వన్‌మ్యాన్‌ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన రేపు

వన్‌మ్యాన్‌ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన రేపు

నెల్లూరురూరల్‌/నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): షెడ్యూల్‌ కులాల ఉప వర్గీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన వన్‌మ్యాన్‌ కమిషన్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజాన్‌ మిశ్రా శనివారం నెల్లూరు పర్యటనకు రానున్నట్లు సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ శోభారాణి గురవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఉదయం 10.30 గంటలకు నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో వన్‌మాన్‌ కమిషన్‌ చైర్మన్‌ అధికారులతో సమావేశమవుతారన్నారు. అనంతరం విజ్ఞప్తులు స్వీకరిస్తారని, జిల్లాలో ఎస్సీ పౌరులు, సంస్థలు, కుల సంఘాల ప్రతినిధులు, అసోసియేషన్లు తమ విజ్ఞప్తులు, అభ్యంతరాలను కమిషన్‌ చైర్మన్‌కు అందించాలని ఆమె కోరారు.

స్టోన్‌హౌస్‌పేట ఎస్‌ఆర్‌గా సుమలతారెడ్డి బాధ్యతలు

నెల్లూరు సిటీ: నగరంలోని స్టోన్‌హౌస్‌పేట స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా సుమలతారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. కావలి సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న సుమలతారెడ్డి స్టోన్‌హౌస్‌పేట కు బదిలీపై వచ్చారు. ఇక్కడ సబ్‌రిజిస్టార్‌గా విధులు నిర్వహిస్తున్న రాధాకృష్ణమూర్తి కావలికి బదిలీ అయ్యారు.

ఇన్‌చార్జి డీఎస్‌ఓగా

అంకయ్య

నెల్లూరు (పొగతోట): జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి (ఇన్‌చార్జ్‌)గా అంకయ్యను నియమించారు. అంకయ్య ప్రస్తుతం డీఎస్‌ఓ కార్యాలయంలో ఏఎస్‌ఓగా విధులు నిర్వహిస్తున్నారు. డీఎస్‌ఓగా పనిచేస్తున్న వెంకటరమణ గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. దీంతో డీఎస్‌ఓ పోస్టు ఖాళీగా ఉండడంతో ఏఎస్‌ఓను ఇన్‌చార్జి డీఎస్‌ఓగా నియమించారు.

20లోపు దరఖాస్తు చేసుకోవాలి

నెల్లూరు (టౌన్‌): స్థానిక కస్తూరిదేవి స్కూల్‌లో ఎస్జీటీ–2, స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం–2, బయాలజికల్‌ సైన్స్‌–1, ఫిజికల్‌ సైన్స్‌–1, హిందీ–1 కలిపి మొత్తం 7 పోస్టులకు ఈ నెల 20వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్ట్‌ నియామకం ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

స్తంభించిన రిజిస్ట్రేషన్లు

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో

నాలుగు రోజులుగా సర్వర్లు డౌన్‌

నెల్లూరు సిటీ: జిల్లాలోని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ పలు సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో గత నాలుగు రోజుల నుంచి సర్వర్లు డౌన్‌ అయ్యాయి. నగరంలోని స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 30వ తేదీ నుంచి 2వ తేదీ మధ్యాహ్నం వరకు సర్వర్‌లు పనిచేయలేదు. దీంతో రిజిస్ట్రేషన్‌లు, ఈసీలు, ఇతర దరఖాస్తులు నిలిచిపోయాయి. 30వ తేదీన బుచ్చిరెడ్డిపాళెంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కూడా సర్వర్‌ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్ల కోసం మూడు రోజుల నుంచి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో గురువారం బుజబుజనెల్లూరు సబ్‌రిజిస్టార్‌ కార్యాలయం ప్రాంతంలో విద్యుత్‌ సమస్య రావడంతో పలు రిజి స్ట్రేషన్లు నిలిచిపోయాయి.

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడిపై టీడీపీ వర్గీయుల దాడి

బాధితుడిపైనే కేసు

ఉలవపాడు: నూతన సంవత్సర వేడుకల్లో వైఎస్‌ జగన్‌ పాట పెట్టారనే నెపంతో వైఎస్సార్‌సీపీ మద్దతు దారుడిపై టీడీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని మర్రిచెట్టు సంఘంలో బుధవారం రాత్రి జరగ్గా గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరేడులోని మర్రిచెట్టు సంఘం గిరిజన కాలనీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం వేడుకలు జరుగుతుండగా, అందులో జగన్‌కు సంబంధించిన పాట పెట్టడంతో టీడీపీ కార్యకర్తలు చేవూరి శ్రీనివాసులు, చేవూరి కృష్ణ వెళ్లి అడ్డుకున్నారు. తాము కావాలని పాట పెట్టలేదని, యూట్యూబ్‌లో వస్తున్న పాటల క్రమంలో జగన్‌ పాట వచ్చిందని ఓ యువకుడు తెలిపాడు. ఇదే సమయంలో ఆ యువకుడి తండ్రి పొట్లూరి కోటయ్య వచ్చి తన కుమారుడిని ఎందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. దీంతో రెచ్చిన పోయిన టీడీపీ నేతలు దాడి చేశారు. దాడిలో గాయపడిన కోటయ్య ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అనంతరం బాధితుడి భార్య వల్లూరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే... ఫిర్యాదు చేసిన బాధితుడిపైనే పోలీసులు కేసు నమోదు చేయడం కొసమెరుపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement