No Headline
వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు మస్తుగా రుణాలు
ఖరీఫ్, రబీ సీజన్లలో రుణ లక్ష్యానికి మించి మంజూరు
వైఎస్సార్‌సీపీ హయాంలో 100 నుంచి 150 శాతం పెరుగుదల
రూ.9,202 కోట్ల నుంచి రూ.18,006 కోట్లకు పెరిగిన లక్ష్యం
టీడీపీ హయాంలో రుణవితరణ లక్ష్యం ఘనం.. ఆచరణ మృగ్యం
అప్పుడు 65 నుంచి 77 శాతం, ఇప్పుడు 67 శాతానికి మించిన వైనం
జిల్లాలోని రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాటు రుణదన్నుగా నిలిచారు. ప్రతి సంవత్సరం రుణ మంజూరు లక్ష్యానికి మించి రుణాలు అందించారు. కోవిడ్ వంటి మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా నూరు శాతం మించి మంజూరు చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో పరిస్థితి దిగజారుగా తయారైంది. గత టీడీపీ హయాంలో రైతులకు రుణ వితరణ లక్ష్యాలు ఘనంగా ఉన్నప్పటికీ.. ఏ సంవత్సరం కూడా సంపూర్ణంగా ఇచ్చిన పరిస్థితి లేదు. రుణాల కోసం రైతులు బ్యాంక్‌లకు వెళ్తే.. ఘోరంగా అవమానించిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ ఏడాది రుణాల మంజూరు పాతాళానికి పడిపోయింది.
కావలి: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిస్తే.. టీడీపీ ప్రభుత్వం గతంలోనూ, ప్రస్తుతం నడ్డి విరుస్తోంది. అధికారంలో ఉండే ప్రభుత్వాలను బట్టే బ్యాంకర్లు సైతం వ్యవహరిస్తున్నారనేది గత పదేళ్లలో వ్యవసాయ రంగానికి రైతులకు ఇచ్చే రుణ వితరణ లక్ష్యాలు.. మంజూరు గణాంకాలు అద్దం పడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు బాగుంటే.. దేశం బాగుంటుందని భావించి ఆ రంగానికి ఎనలేని అండగా నిలిచారు. సేద్యానికి పెట్టుబడి సాయంగా వైఎస్సార్ రైతు భరోసా ఇచ్చారు. పండించిన పంటలకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు కొనేలా చర్యలు తీసుకున్నారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. ఆ సీజన్ ముగిసే నాటికి పరిహారం అందించారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతో బ్యాంకర్లు కూడా వ్యవసాయ రుణాల మంజూరులో ఉదారంగా వ్యవహరించారు.
టీడీపీ గత, ప్రస్తుత పాలనలో అధఃపాతాళం
టీడీపీ అధికారంలో ఉన్న 2014– 2019 వరకు ఐదేళ్లలో మూడేళ్లు 65 నుంచి 77 శాతానికి మించి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయని పరిస్థితి ఉండింది. దీనికి ప్రధాన కారణంగా అప్పట్లో అధికారంలోకి టీడీపీ విధివిధానాలే అని బ్యాంకర్లు స్పష్టం చేశారు. టీడీపీ గతంలో అధికారంలోకి రావడానికి ముందు వ్యవసాయ రుణాలను సంపూర్ణంగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారం దక్కాక.. రుణమాఫీపై మెలికలు పెట్టింది. మాఫీ ఎగనామం పెట్టడానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనలు అమలు చేయకుండా రుణాలు మంజూరు చేశారంటూ బ్యాంకర్లపై ఎదురు దాడి చేసింది. బ్యాంకర్లపై ఆర్‌బీఐకు ఎందుకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కొర్రీలు పెట్టే పరిస్థితికి రావడంతో ఈ దుస్థితి దాపురించిందని బ్యాంకర్లు అప్పట్లో చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment