ఇసుక దోపిడీ.. ఆపే దమ్ముందా?
బుచ్చిరెడ్డిపాళెం: టీడీపీ నేతలు ఇసుకను ప్రధాన ఆదాయవనరుగా మార్చుకున్నారు. ఇసుకాసురులుగా మారారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు మినగల్లు డంపింగ్ యార్డులో 25 వేల టన్నులు, సంగం యార్డులో 15 వేల టన్నులు నిల్వ చేసింది. నెల్లూరులోని ఓ వైద్యశాల అధిపతి స్థానిక ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా ఉన్న ఓ వ్యక్తి టీడీపీ అధికారంలోకి రాగానే ఆ ఇసుక మొత్తం పక్క రాష్ట్రాలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అయినా ఏ ఒక్క అధికారి అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో తీవ్ర విమర్శలు నెలకొన్నాయి. అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఆరు నెలల్లో లక్షల టన్నుల్లో దోపిడీ
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆరు నెలలుగా పెన్నాతీరంలోని మినగల్లు, బాపనపాడు, దామరమడుగుల్లోని అనధికార ఇసుక రీచ్‌ల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. స్థానికుల అంచనాల ప్రకారం లక్షల టన్నుల ఇసుకను రీచ్‌ల నుంచి తరలించి దామరమడుగు వద్ద నిల్వ చేసి తరలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దామరమడుగు వద్ద డంపింగ్ యార్డులో 5,600 టన్నుల ఇసుక అక్రమ నిల్వలు ఉన్నట్లు ఇటీవల అజ్ఞాత వ్యక్తులు భూగర్భ గనుల శాఖ డీడీ బాలాజీనాయక్ సమాచారం అందించారు. దీంతో ఆయన తన సిబ్బంది తనిఖీల్లో ఇసుక అక్రమ నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో బుచ్చిరెడ్డిపాళెం మండలం అడ్డాగా ఇసుక అక్రమ రవాణా సాగుతుందన్న ఆరోపణలకు బలం చేకూర్చింది. భూగర్భ గనుల శాఖాధికారులు ఇచ్చిన సమాచారంతో బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు డంపింగ్ యార్డు వద్దకు వచ్చి ఓ డోజర్, జేసీబీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాత్రి సమయాల్లో డంపింగ్ యార్డు నుంచి ఇతర ప్రాంతాలకు భారీ ధరలకు ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం అందడంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలపడం విశేషం.
పోలీసుల నిఘాలో డొల్లతనం
మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా లేదంటూ ఇన్నాళ్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. తాజాగా ఈ ఘటనతో పోలీసుల నిఘా డొల్లతనాన్ని బయటపెట్టింది. నియోజకవర్గంలో అవినీతికి తావులేదని అక్రమార్కులను ప్రోత్సహించనని ఓ పక్కన ఎమ్మెల్యే ప్రకటిస్తున్నప్పటికి అక్రమార్కులు మాత్రం యథేచ్ఛగా ఇసుక తరలిస్తుండడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రెండేళ్లలో పెన్నానదిలో ఇసుక నిల్వలు కొరవడి భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఏర్పడుతుందని పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఏడు నెలలుగా ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. స్థానిక ప్రజాప్రతినిధి అండతో లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా తరలించి రూ.కోట్లు దోచుకున్నారు. ఆపే దమ్ము అధికారులకు లేకుండా పోయింది. బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని పెన్నా పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారడంతో ప్రస్తుతం మౌనం దాల్చినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో మినగల్లులో 25 వేలు, సంగంలో 15 వేల టన్నుల నిల్వ
అధికారంలోకి రాగానే వాటిని ఖాళీ చేసిన టీడీపీ తమ్ముళ్లు
దామరమడుగు వద్ద అక్రమంగా డంపింగ్
ఆరు నెలల్లో లక్షల టన్నుల
అక్రమ రవాణా
అజ్ఞాత వ్యక్తుల ఫిర్యాదుతో గనుల శాఖ దాడుల్లో పట్టుబడిన అక్రమ నిల్వలు
Comments
Please login to add a commentAdd a comment