పాటూరులో మినీ క్లస్టర్ ఏర్పాటుకు
కేంద్రం ఆమోదం
కోవూరు: జిల్లాలో చేనేతకు ప్రసిద్ధిగాంచిన పాటూరు చేనేతలకు తీపి కబురు అందింది. కోవూరు నియోజకవర్గంలోని పాటూరు గుమళ్లదిబ్బలో చేనేత క్టస్లర్ ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందు కోసం రూ. 76.32 లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాటూరులోని గుమ్మలదిబ్బలో ఉన్న 175 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తొలి విడతలో రూ.28 లక్షలు మంజూరు చేసింది. కోవూరు నియోజకవర్గంలో ఉన్న పాటూరులో స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇటీవల నవంబర్ 26న కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు విన్నవించారు. పాటూరులో అనేక కుటుంబాలు పూర్తిగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, ఇక్కడ క్లస్టర్ ఏర్పాటు ఆవశ్యకతను కేంద్రమంత్రికి వివరించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ కమిషనర్ జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద ఐదు కొత్త స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను చేనేత అభివృద్ధి కమిషనర్‌కు సమర్పించారు. అందులో పాటూరు కూడా ఒకటి ఉంది. పాటూరులో స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌సీడీపీ) ప్రతిపాదనలు అంగీకరించి నిధుల మంజూరుకు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ వేమిరెడ్డి విజ్ఞప్తి మేరకు పాటూరు– గుమళ్లదిబ్బ మినీ క్లస్టర్ ఏర్పాటును నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దాంతో పాటూరు– గుమళ్లదిబ్బ గ్రామాలకు చెందిన చేనేత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా దీని కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.
క్లస్టర్ ఏర్పాటుతో జరిగే మేలు..
క్లస్టర్ ఏర్పాటుతో స్థానికంగా ఉండే చేనేతలకు ఎంతో మేలు జరగనుంది. చేనేతలకు మగ్గం సామగ్రి అందించడంతో పాటు వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తారు. మగ్గం వర్క్‌లో అధునాతన విధానాలు సమకూరుస్తారు. మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉన్న డిజైన్లపై తగిన శిక్షణ అందించి వారికి నేర్పిస్తారు. ఎవరైనా చేనేత వ్యక్తిగతంగా సొంత స్థలం ఉండి రూమ్ ఏర్పాటు చేయాలని భావిస్తే అందుకు తగిన నిధులు సమకూరుస్తారు. వారి ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి విలువ ఉండేలా కృషి చేస్తారు. చేనేతలను అన్ని విధాలా ఆదుకునేందుకు, వారికి అండగా తగిన ప్రోత్సాహం అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment