ఎట్టకేలకు కుడి కాలువకు నీటి విడుదల
లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్ట్ కుడి కాలువకు మంగళవారం మధ్యాహ్నం అధికారులు నీటిని విడుదల చేశారు. 25 రోజుల క్రితం కాలువ గేటు తూములో ఇరుక్కుపోయి పైకి లేవని విషయం తెలి సిందే. దానిని తీసేందుకు అధికారులు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. నీరు విడుదల కాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో తూమును పగులగొట్టారు. మోటార్లు ఏర్పాటు చేసి కుడి కాలువకు నీరు పోయేలా ఏర్పాట్లు చేశారు. నాలుగు రోజుల క్రితం వర్షం కురవడంతో ప్రాజెక్ట్‌కు 1.1 టీఎంసీల నీరు పూర్తి స్థాయిలో చేరింది. దీంతో కుడి కాలువకు నీటిని ఆపివేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్ నుంచి టెక్నో క్రాట్స్ సిబ్బంది వచ్చి తూము వద్ద ముందు భాగంలో ఒక షట్టర్‌ను ఏర్పాటు చేసి దాని ముందు ఇసుక బస్తాలు నింపి హైడ్రాలిక్ జాకీలతో కాలువ గేటును పైకి లేపేందుకు సోమవారం ప్రయత్నించారు. రెండడుగుల మేర గేటు పైకి లేచినట్లు డీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. మంగళవారం గేటు పూర్తిగా పైకి లేచినట్లు ఆయన తెలిపారు. కాగా గేటుకు రాడ్‌కు మధ్య ఉన్న నట్లు ఊడిపోయాయని, వాటిని బిగించి యథావిధిగా గేటును కొంతమేర కిందకి దింపి నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 20.10 అడుగులుండగా ఇన్‌ఫ్లో 110 క్యూసెక్కులు వస్తోందని, కుడికాలువకు 200, ఎడమ కాలువకు 40 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment