పాల వ్యాన్ ఢీకొని..
● వ్యక్తి మృతి
వలేటివారిపాళెం: పాల వ్యాన్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్‌ఫర్డ్ పాఠశాల సమీపంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని రొళ్లపాడు గ్రామానికి చెందిన చొప్పుర వేణు (40) వ్యక్తిగత పనులపై తన మోటార్‌బైక్‌పై కందుకూరుకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. పోకూరు గ్రామం వద్ద ఉన్న ఆక్స్‌ఫర్డ్ పాఠశాల సమీపానికి రాగానే వలేటివారిపాళెంలో పాల క్యాన్లు తీసుకుని సింగరాయకొండ వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వేణు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పాల వ్యాన్‌ను అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కారు ఢీకొని
ఐదుగురికి గాయాలు
కావలి: గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు గాయపడినట్లు కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ జి.రాజేశ్వరరావు గురువారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. కావలిలో నివాసముంటున్న గౌడుపేరు కాంతారావు టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడి అన్న గౌడపేరు కాలయ్య కూడా పట్టణంలో నివాసం ఉంటున్నాడు. కాగా వారి తల్లిదండ్రులు గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో ఉన్నారు. వారికి అనారోగ్యంగా ఉండటంతో కాంతారావు, అరుణ దంపతులు, కాలయ్య, రాములమ్మ దంపతులతోపాటు కుమారుడు శ్యాంసన్‌లు రెండు మోటార్‌బైక్‌లపై చేవూరుకు వెళ్లి పరామర్శించి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కావలికి తిరుగు ప్రయాణమయ్యారు. చైన్నె – కోల్‌కత్తా జాతీయ రహదారిపై కావలికి వస్తుండగా రూరల్ మండలం రుద్రకోట గ్రామం వద్ద ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గుర్తుతెలియని కారు రెండు బైక్‌లను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వారు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నారు. కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రొయ్యల గుంతలో పడి
వ్యక్తి మృతి
ఇందుకూరుపేట: ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి రొయ్యల గుంతలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గంగపట్నం గ్రామంలో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృష్ణారావు (51) తన భార్యతో కలిసి ఓ రైతుకు చెందిన రొయ్యల గుంత వద్ద కాపలాగా ఉన్నాడు. రొయ్యలకు మేత వేసే క్రమంలో అతను ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతిచెందాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఎస్సై నాగార్జునరెడ్డి తెలిపారు.
తాటిపర్తిలో అదుపులోకి
రాని జ్వరాలు
పొదలకూరు: మండలంలోని తాటిపర్తి గ్రామంలో వైరల్ జ్వరాలతో జనం మంచం పడుతున్నారు. వారం రోజులుగా జ్వరపీడితులు ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. వాతావరణ మార్పులతోపాటు చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ గ్రామంలో పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో ఉన్న మహ్మదాపురం పీహెచ్‌సీ వైద్యులు సర్వే నిర్వహించి రక్త నమూనాలను సేకరించి మందులను పంపిణీ చేస్తున్నా జ్వరాలు ఇంకా అదుపులోకి రావడం లేదని గ్రామస్తులు వెల్లడించారు. గురువారం కూడా వైద్యాధికారి నరసింహారావు పర్యవేక్షణలో ఇంటింటి సర్వే నిర్వహించారు. వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. గ్రామంలో మిట్ట మీద ప్రాంతంలో జ్వరాలు విజృంభించాయని, వాటిని అదుపు చేసేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. మురుగు కాలువల్లో దోమలు ఉధృతి పెరగకుండా అదుపు చేసేందుకు అబేట్ ద్రావణాన్ని పిచికారీ చేసి లార్వాను నాశనం చేస్తున్నారు.
చికిత్స పొందుతూ
మృత్యువాత
సంగం: మండలంలోని దువ్వూరు వద్ద నెల్లూరు – ముంబై హైవేపై బుధవారం రాత్రి మినీ లారీ, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నంద్యాలకు చెందిన మినీ లారీ డ్రైవర్ దస్తగిరి మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా తీవ్రంగా గాయపడి నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్ రమణారెడ్డి (60) గురువారం చనిపోయాడు. సంగం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడిని నెల్లూరు వాసిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment