ఉపాధి అవినీతి పరులపై చర్యలకు జాప్యం
ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతికి పాల్పడిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం చూస్తుంటే.. వారిని కాపాడే ప్రయత్నంలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమాలు తేల్చి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను జిల్లా ఉన్నతాధికారులు తొక్కి పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి పాత్ర ఉందని తేలిన సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.. కానీ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక భారీగానే నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది.
నెల్లూరు (పొగతోట): కొడవలూరు మండలం తలమంచిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో రూ.28 లక్షలు అవినీతి జరిగింది. ముగ్గురు ఎంపీడీఓలు, ఉపాధి హామీ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసి రెండు నెలలు గడుస్తోంది. అయితే సిబ్బందిని సస్పెండ్ చేశారు. కానీ క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. ముగ్గురు ఎంపీడీఓలకు కనీసం షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు కూడా లేదని ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగానే ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాపూరు మండలంలో రూ.60 లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు సోషల్ ఆడిట్ టీమ్ నిర్ధారించింది. ఇందుకు బాధ్యులైన సిబ్బందిపైన కూడా కనీసం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. సేఫ్ జోన్‌గా పక్క మండలాలకు బదిలీలు చేసి ఊరుకున్నారు. రూ.లక్షల్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన సిబ్బంది సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
●
కొడవలూరు, రాపూరు
సిబ్బందిపై సస్పెన్షన్ వేటుతో సరి
అధికారులపై క్రిమినల్
కేసులు పెట్టాలని కమిషనర్ ఆదేశాలు
రెండు నెలలు కావస్తున్నా.. అతీగతి లేదు
Comments
Please login to add a commentAdd a comment