ఆగిన అభివృద్ధి పనులు
జిల్లాలో కొత్తగా రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనల్లేవ్
గ్రామీణ రహదారులు ప్రగతికి చిహ్నాలు. గత ప్రభుత్వంలో ప్రారంభమై శరవేగంగా జరుగుతున్న పనులను కూటమి ప్రభుత్వం ఒక్క కలం పోటుతో నిలిపివేసింది. కూటమి పాలకులు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా జిల్లాలో రహదారులు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. అక్కడక్కడా ప్యాచ్ వర్క్‌లతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా రహదారుల అభివృద్ధి, నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం ఒక్క ప్రతిపాదనలు లేకపోగా, జరుగుతున్న పనులను నిలిపివేసి కాంట్రాక్టర్ల పాలిట శాపంగా దాపురించింది.
గత ప్రభుత్వంలో ప్రారంభమైన పనులపై ఆంక్షలు
● 25 శాతం లోపు జరిగిన పనులను
రద్దు చేస్తూ ఆదేశాలు
● ఆగిపోయిన సీఆర్‌ఐఎఫ్,
ఎండీఆర్, రాష్ట్ర హైవే పనులు
● జిల్లాలో రూ.200 కోట్ల మేర
పనుల రద్దు
● లింకు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం ఆగిపోవడంతో నరకయాతన ప్రయాణం
● చేసిన పనులకు బిల్లులు రాక
నష్టపోయిన కాంట్రాక్టర్లు
ఆగిపోయిన నెల్లూరు నుంచి మైపాడు వెళ్లే రోడ్డు పనులు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ప్రధాన రహదారుల అభివృద్ధికి చంద్ర గ్రహణం పట్టింది. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి రహదారులు అభివృద్ధి చేయలేదంటూ నిత్యం అసత్యాలు ప్రచారం చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం నిర్మాణాలు ప్రారంభించిన పనులను అర్ధాంతరంగా నిలిపివేసింది. ఇప్పటికే అనేక రహదారుల నిర్మాణం పూర్తికాగా, కొన్ని రోడ్ల నిర్మాణాలు 50 శాతం నుంచి 80 శాతం వరకు పనులు జరిగాయి. ఎన్నికలకు మూడు నెలలు ముందు ప్రారంభించిన పనులు అయితే 25 శాతానికి పైగానే జరిగాయి.
లింక్ రోడ్ల పనులకు గత ప్రభుత్వం ప్రాధాన్యం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రధానంగా జిల్లాలో లింక్ రోడ్ల నిర్మాణాలతోపాటు పునర్నిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారులను విస్తరించడంతోపాటు పునర్నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లాలో సుమారు రూ.400 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. పలుచోట్ల పనులు జరుగుతుండగా అంతలోనే ప్రభుత్వం మారింది. అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వంలో రోడ్లకు చంద్రగ్రహణం పట్టించింది. రోడ్లు పూర్తయితే మంజూరు చేసిన నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావించిన ప్రస్తుతం సీఎం 25 శాతంలోపు జరిగిన పనులతోపాటు పనులు మొదలు కాని వాటిని రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా సుమారు రూ.200 కోట్లకు పైగా నిధులతో జరుగుతున్న పనులన్ని అర్ధాంతరంగా నిలిచిపోయింది.
2023లోనే ప్రతిపాదనలు
ఎన్‌డీబీ ప్రాజెక్ట్ కింద మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ రోడ్లతో అనుసందించాలని రూ.422 కోట్లతో ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదించిన 15 పనులు ఆమోదించింది. అందులో భాగంగా కావలి పట్టణంలోని పాత బైపాస్ (చైన్నె–కోల్‌కతా) రహదారికి రూ 55 కోట్లు, సీఆర్‌ఐఎఫ్ పనుల కింద 4 పనులు రూ.115 కోట్లతో మంజూరయ్యాయి. వీటికి టెండర్లు పిలిచారు. 2024 నాటికి కొన్ని చోట్ల పనులు జరిగాయి. మరి కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని చోట్ల ప్రారంభం కావాల్సి ఉండగా అంతలోనే సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిగతా పనులు ప్రారంభించడానికి వీలు లేకుండా పోయింది.
అధికారం మారడంతో పనులకు మోకాలడ్డు..
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అప్పటికే పలుచోట్ల జరుగుతున్న రోడ్లు నిర్మాణాలను నిలిపివేశారు. మరికొన్ని చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు పాత కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు డిమాండ్ చేసి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్లు అడిగింది ఇచ్చుకుని పనులు ప్రారంభించినప్పటికీ.. కూటమి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకుండా ఆపేసింది. కూటమి ప్రభుత్వంలో పార్టీ నేతల పరిస్థితిని చూసి చాలా రహదారుల నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు పనుల వేగాన్ని తగ్గించారు.
సంక్రాంతి కానుకగా
రూ.200 కోట్ల పనుల నిలిపివేత
గత ప్రభుత్వంలో మంజూరై జరుగుతున్న పనులను పూర్తి చేస్తే ఆ ప్రభుత్వానికే క్రెడిట్ దక్కుతుందని భావించిన కూటమి ఎమ్మెల్యేలు ఆయా పనులను తమ వాళ్లకు అప్పగించి కమీషన్లు దందుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా 25 శాతం కూడా పనులు పూర్తి చేయలేదంటూ, కొన్ని చోట్ల పనులు ప్రారంభించలేదంటూ నిర్మాణంలో సుమారు రూ. 200 కోట్ల పనులను సైతం అర్ధాంతరంగా రద్దు చేసింది. జిల్లా ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ నెల 13న జిల్లాలో రోడ్లు పనులను రద్దు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఆర్‌అండ్‌బీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు ఆగిపోవడంతో పూర్తికాని రోడ్లపై రాకపోకలు సాగించలేక ప్రజలు నరక ప్రయాణం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు.
నిలిచిన ఎండీఆర్, స్టేట్ హైవే పనులు
మేజర్ డిస్ట్రిక్ట్స్ రోడ్లు, స్టేట్ హైవే పనులు పలుచోట్ల జరుగుతుండగా వాటిని కూడా ప్రభుత్వం ఆపేసింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని తిరుమలమ్మపాళెం 8.8 కి.మీ రోడ్డుకు రూ.3 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులు టెండర్ దశలోనే ఉన్నాయి. అంతలోనే ఈ పనులు కూడా ఆపేశారు. కొలనుకుదురు నుంచి 9.75 కి.మీ పరిధిలో రోడ్డు నిర్మాణానికి రూ .4 కోట్లు మంజూరయ్యాయి. కావలి పట్టణంలో 0/0 కి.మీ. నుంచి 8/0 కి.మీ వరకు నిర్మించాల్సిన రూ.41.82 కోట్లతో అగ్రిమెంట్ జరిగిన రోడ్డు పనులు కూడా ఆపేశారు. నెల్లూరు నుంచి కృష్ణపట్నం రోడ్డులో పొట్టెంపాడు వద్ద నక్కల వాగు మీద బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేశారు. తొలి దశ టెండర్లలో కాంట్రాక్టర్లు ఎవరూ పాల్గొనలేదని, రెండో దఫా టెండర్లు పిలిచారు. అయితే ఈ పనిని కూడా ప్రభుత్వం ఆపేసింది. ఇలా రూ.200 కోట్లకు పైగా జరగాల్సిన అన్ని రకాల అభివృద్ధి పనులు ఒక్క కలంపోటుతో ఆగిపోయాయి.
నెల్లూరు నుంచి మైపాడు రోడ్డుకు రూ.48 కోట్లు మంజూరయ్యాయి. మొదటి దశ పనులు పూర్తయ్యాయి. రెండో దశ పనులు ప్రారంభం కాగా, అయితే అసలు పనులే ప్రారంభం కాలేదంటూ ఆ పనిని ఆపేశారు. పనులు పూర్తి చేయడానికి అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ సమయమివ్వకుండా పనులు రద్దు చేస్తూ ఉత్తర్వులు రావడం గమనార్హం.
గూడూరు నుంచి తురిమెర్ల రోడ్డుకు రూ.30 కోట్లు మంజూరై సుమారు 15 శాతం పనులు పూర్తయ్యాయి. 25 శాతం కూడా పనులు జరగలేదంటూ ఆపేశారు.
నెల్లూరు నుంచి పొదలకూరు మీదుగా సైదాపురం వరకు రోడ్లు విస్తరించడంతోపాటు అభివృద్ధి చేయడం కోసం రూ.45 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. 25 శాతం పూర్తి కాలేదంటూ ప్రభుత్వం ఆపేసింది.
మాకు ఇంకా ఆదేశాలు అందలేదు
జిల్లాలో ఆర్‌అండ్‌బీ పనులు ఆపేసినట్లు ఆదేశాలు ఇంకా ఈఏసీ నుంచి మా కార్యాలయానికి అందలేదు. ఉత్తర్వులు చేతికందితేనే పూర్తి వివరాలు తెలుస్తాయి. అప్పటి వరకు ఏమి చెప్పలేను. ప్రస్తుతం పనులు అయితే మందకొడిగానే జరుగుతున్న మాట వాస్తవమే.
– ఎం.గంగాధరం, ఎస్‌ఈ,
ఆర్‌అండ్‌బీ శాఖ, నెల్లూరు సర్కిల్
Comments
Please login to add a commentAdd a comment