ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు..
కావలి: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులపై కర్కశంగా ప్రవర్తిస్తూ క్షోభకు గురి చేస్తున్న టీడీపీ నాయకులు, వారిని ప్రోత్సహిస్తున్న శక్తులతోపాటు కొందరు పోలీసులు అధికారులను సైతం ఎవరినీ వదిలే ప్రసక్తేలేదని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. పది రెట్లు క్షోభ పడే రోజులు వస్తాయని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం ఏనుగులబావి పంచాయతీ కోళ్లదిన్నెలో టీడీపీ నాయకులు దాడిలో తీవ్రంగా గాయపడి కావలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నేత పల్లెబోయిన శ్రీనివాసులురెడ్డిని ఆదివారం కావలి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో కాకాణి మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మనుగడ సాగించాలని భావించడం పొరపాటన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను బాధ పెట్టిన వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, వారిని శిక్షించడం ఖాయమని హెచ్చరించారు. టీడీపీ నాయకుల మెప్పు కోసం పోలీసులు చేస్తున్న పాపాలు భవిష్యత్‌లో వారికి శా పాలు మారుతాయన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరూ మిమ్మల్ని కాపాడలేడన్నారు. ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడితే అప్పడు మీకు, మీ కుటుంబాలకు తెలుస్తాయన్నారు.
బతుకుదెరువుపై దెబ్బ కొడతారా?
అధికారం శాశ్వతం కాదు.. టీడీపీ నాయకులు దాడులు చేయడం, పోలీసుల చేత కొట్టించడం, ఆస్తులు లాక్కోవడం, వ్యాపారాలను దెబ్బకొట్టడం, వృత్తులను ధ్వంసం చేయడం... ఇలా అనేక విధాలుగా దమనకాండ సాగిస్తున్నారని, పోలీసుల అండ లేకుండా టీడీపీ నాయకులు ధైర్యంగా గ్రామాల్లో స్వేచ్ఛగా తిరగగలరా?, మనుగడ సాగించగలరా? అని కాకాణి సవాల్ చేశారు. పోలీసులు, అధికారులు టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు దిగజారి వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నామన్నారు.
సంక్షేమం, అభివృద్ధి గాలికి..
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి రెడ్‌బుక్ రాజ్యాంగం, కక్ష సాధింపుల పాలన సాగిస్తున్నారని కాకాణి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడి దాడులకు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ దాడులు నిత్యకృత్యంగా మారాయన్నారు. టీడీపీ నేతల దాడిలో శ్రీనివాసులురెడ్డి గాయపడి చికిత్స కోసం కావలిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వస్తే, ఆస్పత్రి ప్రాంగణంలో కూడా ఆయనపై మళ్లీ దాడి చేయడం దారుణమన్నారు. శ్రీనివాసులురెడ్డి దంపతులు చెబుతున్న విషయాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. ఈ ఘటనలో బాధితులు 8 మందిపై కేసులు బనాయించారన్నారు. దాడి చేసిన వారిని రాచ మర్యాదలతో వదిలేశారని, బాధితులను పోలీస్‌స్టేషన్‌లో పెట్టి ఇబ్బందికి గురిచేశారని చెప్పారు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పోలీసులపై ప్రైవేట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పది రెట్లు క్షోభ పడే రోజులు వస్తాయి.. సిద్ధంగా ఉండండి
కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment