ఉమ్రా యాత్ర పేరిట ట్రావెల్స్ సంస్థ మోసం
● కేసు నమోదు చేసిన పోలీసులు
● మోసగాళ్ల కోసం చైన్నెలో గాలింపు
నెల్లూరు(క్రైమ్): ఉమ్రా యాత్ర పేరిట చైన్నెకు చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ జిల్లాలోని పలువురు ముస్లింల వద్ద నుంచి పెద్దఎత్తున నగదు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మోసగాళ్ల కోసం గాలిస్తున్నారు. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు వెంగళరావ్‌నగర్ ఎన్‌సీసీ కాలనీకి చెందిన సయ్యద్ ఖాదర్ షరీఫ్ తన భార్య, బంధువు రిజ్వాన్ కుటుంబంతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రిజ్వాన్ ద్వారా ఖాదర్ నెల్లూరులోని జబ్బార్ మౌలానాను కలిసి ఈ విషయాన్ని తెలిపాడు. అతను చైన్నెలోని ఓ ట్రావెల్స్ సంస్థ గురించి చెప్పి వెంగళరావ్‌నగర్‌కు చెందిన అబ్దుల్ ముజీర్‌ను కలిస్తే మరింత సమాచారం వస్తుందన్నాడు. దీంతో వారు ముజీర్‌ను కలిసి అతడి ద్వారా ట్రావెల్స్ సంస్థ నిర్వాహకుడు జాఫర్, పీఏ సలాంను ఫోన్‌లో సంప్రదించారు. యాత్రకు ఒక్కొక్కరికి రూ.55 వేలు ఖర్చవుతుందని, ఆలస్యంగా చెల్లిస్తే రూ.60 వేలవుతుందని నిర్వాహకుడు చెప్పాడు. దీంతో ఖాదర్, రిజ్వాన్ కుటుంబసభ్యులు ముజీర్ ద్వారా రూ.3.40 లక్షల నగదు, ఒరిజినల్ పాస్‌పోర్టులను పంపారు. రోజులు గడుస్తున్నా ట్రావెల్స్ నిర్వాహకుడు వీసాలు పంపకపోవడంతో ఖాదర్, రిజ్వాన్‌లకు అనుమానం వచ్చింది. ముజీర్‌ను సంప్రదించగా ఆయన జాఫర్, సలాంకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయి. దీంతో ఈనెల ఆరో తేదీన బాధితులు చైన్నెకి వెళ్లి చూడగా సంస్థ మూసి వేసి ఉంది. చుట్టుపక్కల విచారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తమను మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఖాదర్ షరీఫ్ నాలుగు రోజుల క్రితం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందం గురువారం చైన్నెకి వెళ్లి నిందితుల కోసం గాలిస్తోంది. ఇదిలా ఉంటే జిల్లాలో ఇదే తరహాలో సుమారు 150 మందికి పైగా మోసపోయినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
వ్యక్తి బలవన్మరణం
సోమశిల: మండల పరిధిలోని శంకరనగరం గ్రామంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన యర్ల కొండయ్య (55) కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 14వ తేదీన పొలానికి వెళ్లి మద్యంలో గడ్డిమందు కలిపి తాగాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.
సహకార శాఖ
డైరీ ఆవిష్కరణ
నెల్లూరు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి 2025 సంవత్సరం డైరీని జేసీ కార్తీక్ శుక్రవారం నెల్లూరులోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా సహకార శాఖాధికారి గుర్రప్ప ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పూర్తి దశలో ఉన్న కంప్యూటరీకరణ గురించి జేసీకి వివరించారు.
నెల్లూరు పౌల్ట్రీ
అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 129
లేయర్ (లైవ్) : 88
బ్రాయిలర్ చికెన్ : 232
బ్రాయిలర్ స్కిన్‌లెస్ : 256
లేయర్ చికెన్ : 150
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.39
సన్నవి : రూ.28
పండ్లు : రూ.18
Comments
Please login to add a commentAdd a comment