పెదపవనిలో ఉద్రిక్తత
● స్థల వివాదంలో ఇరువర్గాల ఘర్షణ
● స్టేటస్‌కో ఉన్నా ఫెన్సింగ్ వేసిన
టీడీపీ నాయకులు
● న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించిన
వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు
లింగసముద్రం: కోర్టు స్టేటస్‌కో ఉన్నా లెక్కచేయకుండా స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన లింగసముద్రం మండలంలోని పెదపవని గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. పెదపవని గ్రామ సర్వే నంబర్ 439/1లోని గ్రామ కంఠంలో కొంత స్థలాన్ని జెడ్పీటీసీ డాక్టర్ చెన్ను నళినీపద్మ గతంలో ముస్లింల వద్ద కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ విషయం గ్రామంలోని ముస్లింలకు తెలియడంతో గత సంవత్సరం ఆ స్థలం వద్దకు వెళ్లి ఇది పీర్లచావిడిగా ఉండేదని, దీనిని మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అడిగారు. ముస్లిం పెద్దలు తమకు విక్రయించగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు చెప్పారు. దీనిపై వివాదం రేగడంతో జెడ్పీటీసీ కోర్టును ఆశ్రయించగా స్టేటస్‌కో విధించింది. అయితే టీడీపీ నాయకుడు షేక్ రఫి ఆధ్వర్యంలో వందలాది మంది శుక్రవారం మధ్యాహ్నం ఆ స్థలం వద్దకు వెళ్లి జేసీబీతో గుంతలు తీసి ఫెన్సింగ్ వేయాలని ప్రయత్నించారు. దీంతో జెడ్పీటీసీ బంధువులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని వారించడంతో ఘర్షణ నెలకొంది. జేసీబీతో గుంత తీస్తుండగా గ్రామస్తులు అడ్డుపడటంతో వాహనం తగిలి ఎస్సై మహబూబ్ సుభానీతోపాటు కొందరు కిందపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ బంధువులకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు వారిని చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ డాక్టర్ నళీనీపద్మ ఆమె భర్త వైఎస్సార్‌సీపీ నాయకుడు చెన్ను ప్రసాద్ స్థలం వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో గుడ్లూరు సీఐ మంగారావు, తహసీల్దార్ సీతామహాలక్షి అక్కడకు చేరుకుని ఇద్దరికీ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు.
అధికారులు న్యాయం చేయడంలేదు
స్థల వివాదం కోర్టులో ఉన్నా అధికారులు న్యాయం చేయడంలేదని జెడ్పీటీసీ సభ్యురాలు చెన్ను నళినీపద్మ అన్నారు. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని దౌర్జన్యం చేసి నానా ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమన్నారు. టీడీపీ నాయకుడు షేక్ రఫీ రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే కులాలు, మతాల మధ్య వివాదం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో వివాదం జరుగుతుండగా పోలీసు బందోబస్తుతో ముస్లింలు ఫెన్సింగ్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment