ఫ్లెమింగో ఫెస్టివల్‌కు సర్వం సిద్ధం
● నేటి నుంచి 20వ తేదీ వరకు..
సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్ – 2025 శనివారం నుంచి మూడురోజులపాటు జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పరిశీలించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం, అటకానితిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రం, పులికాట్ సరస్సులో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. తొలిరోజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతులు మీదుగా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. శ్రీచెంగాళమ్మ ఆలయం నుంచి ర్యాలీని నిర్వహించనున్నారు. 19న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు క్రీడా పోటీలు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పాఠశాల విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు, 5 నుంచి 7 గంటల వరకు నృత్య ప్రదర్శనలు, 7 నుంచి రాత్రి 11 గంటల ప్రముఖ కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలుంటాయి. 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు సంప్రదాయ వంటల పోటీలు, 4 నుంచి 5 గంటల వరకు ఫెస్టివల్ ముగింపు తదితర కార్యక్రమాలు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.
1,17,216 విదేశీ విహంగాలు
ఇక్కడికొచ్చే విదేశీ వలస పక్షుల్లో అతి అందమైంది ఫ్లెమింగో కావడంతో దాని పేరుతో పండగను నిర్వహిస్తున్నారు. సూళ్లూరుపేట – శ్రీహరికోట రోడ్డు మార్గంలో పులికాట్ సరస్సులో నీళ్లు సమృద్ధిగా ఉండటంతో ఫ్లెమింగోలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. పులికాట్ సరస్సు, నేలపట్టులో కలిపి సుమారు వందల రకాలకు చెందిన 1,17,216 స్వదేశీ, విదేశీ వలస విహంగాలు విచ్చేసినట్టు పులికాట్ వన్యప్రాణి సంరక్షణాధికారులు వెల్లడించారు. నేలపట్టులో పక్షుల సందర్శన, తడ మండలం భీములవారిపాళెం పడవల రేవు వద్ద బోట్ షికార్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment