ఏఎన్‌ఎం గ్రేడ్–3ల సీనియారిటీ జాబితా విడుదల
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని సచివాలయాల్లో గ్రేడ్–3 ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు కల్పించేందుకు తయారు చేసిన రివైజ్డ్ ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను (ఎంపిహెచ్‌ఏ–ఎఫ్) విడుదల చేశామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుజాత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలను ఎస్పీఎస్‌నెల్లూరు. ఏపీ.జీవోవి.ఇన్ /నోటీసు/రిక్రూట్‌మెంట్ అనే వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. ఈ సీనియారిటీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 14వ తేదీ సాయంకాలంలోపు తగు ఆధారాలతో సరి చేయించుకోవాలని సూచించారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు
224 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 224 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 4802 మందికి 4658 మంది హాజరయ్యారు. 144 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి జరిగిన పరీక్షకు 4267 మందికి 4187 మంది హాజరయ్యారు. 80 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ శ్రీనివాసులు 4 కేంద్రాలు, డీవీఈఓ మధుబాబు 6 కేంద్రాలను తనిఖీ చేశారు.
ఆక్రమణలను తొలగిస్తాం
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెంలో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో రోడ్లపై ఆక్రమణలను తొలగిస్తామని నగర కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ముంబై రోడ్డులో వైఎస్సార్ కూడలి నుంచి మలిదేవి వరకు చెన్నూరు రోడ్డులో ఉన్న ఆక్రమణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువగా ఆక్రమించిన వారి వస్తువులను మున్సిపాలిటీ ట్రాక్టర్లలో స్టేషన్‌కు తరలించారు. బుధవారం నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక ఆక్రమణ తొలగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ఆదేశాలను ధిక్కరించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సుమారు 50 మంది నగర పంచాయతీ సిబ్బంది, 25 మంది వరకు పోలీసు సిబ్బంది ఈ ఆక్రమణ తొలగింపులో పాల్గొన్నారు.
21న జెడ్పీ స్థాయీ
సంఘ సమావేశాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 21వ తేదీన జెడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ విద్యారమ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు 7 స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయి. ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు హాజరు కావాలని కోరారు.
పుష్పయాగానికి అంకురార్పణ
రాపూరు: ెపంచలకోనలో వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవికి మంగళవారం రాత్రి వేదపండితులు పుష్పయాగానికి అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతారామయ్యస్వామి మాట్లాడుతూ మాఘ పౌర్ణమినాడు స్వామివారికి పుష్పయాగం చేయడం దేవస్థాన ఆచారమన్నారు. అనంతరం అనుజ్ఞ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment