మూగజీవాల మౌనవేదన
కావలి: కావలి పట్టణంలోని రైల్వే రోడ్డులో ఉన్న పశువుల ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే వైద్యుడు సమయ పాలన పాటించడం లేదు. ఆస్పత్రికి ఎప్పుడు వస్తాడో, ఎంత సేపు ఉంటాడో కూడా చెప్పలేని పరిస్థితి. సాక్షాత్తూ కావలి డివిజన్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ హోదా అధికారుల కార్యాలయాలు కూడా పశువుల ఆస్పత్రిని ఆనుకునే ఉంటాయి. అంటే ఉన్నతాధికారుల కార్యాలయాల చెంతనే ఉన్న పశువుల ఆస్పత్రిలో వైద్యుడు విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నరంటే ఆ శాఖలో పరిస్థితికి అద్దం పడుతోంది.
కావలిలోని ప్రభుత్వ పశు వైద్యశాల ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటలు వరకు సేవలు అందిస్తుందని ఆస్పత్రి ప్రాంగణంలోని గోడకు కాగితం అంటించారు. అయితే మూగ జీవాలకు వైద్య సేవలు అందించే వైద్యుడు మాత్రం ఆ సమయ వేళల్లో ఉండరు. సాక్షి మంగళవారం ఉద యం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు కావలి పట్టణంలోని పశువుల ఆస్పత్రిలో గమనించగా, అక్కడ జరుగుతున్న తంతు విస్తుపోయేలా ఉంది.
వింజమూరులో వేళలు పాటించరు
వింజమూరు: వింజమూరు పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న పశువైద్యశాలను మంగళవారం ’సాక్షి’ విజట్ చేసే సమయంలో (8.45 గంటల) తలుపులు తీశారు. ఈ వైద్యశాలలో సహాయ సంచాలకులు, పశుగణ సహాయకులుతో పాటు కార్యాలయ సబార్డినేట్ ఉన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాలి. కానీ సబార్డినేట్ తలుపులు తీసి వెళ్లిపోయారు. 9.30 గంటల వరకు ఎవరూ రాలేదు. వైద్యశాలలో అన్ని కుర్చీలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. విఽధి నిర్వహణలో వేళలు పాటించకపోవడంతో పశుపోషకులు ఇబ్బంది పడుతున్నారు.
మాచవరంలో పశువైద్యాధికారి లేరు
కందుకూరు రూరల్: మండలంలోని మాచవరం పశువైద్యాధికారి పదోన్నతిపై వెళ్లడంతో ఆ పోస్టులో పశు వైద్యులను నియమించలేదు. ఇన్‌చార్జి వైద్యాధికారిగా కోవూరు పశువైద్యశాలకు చెందిన వైద్యులు ఎస్.సుధాకర్‌ను నియమించారు. రెండు వైద్యశాలలను ఆయనే చూస్తున్నారు. ప్రతి సచివాలయంలో పశువైద్య అసిస్టెంట్లు ఉండగా వైద్యుల సూచనల మేరకు పశువైద్యం అందిస్తున్నారు. అత్యవసరం సమయంలో వైద్యులకు సమాచారం అందిస్తే వైద్యులు వెళ్లి వైద్యం అందిస్తున్నారు. పర్మినెంట్ పశువైద్యాధికారిని నియమించాలని మాచవరం పశుపోషకులు కోరుతున్నారు.
కోడి పుంజును కుక్క కరిసింది..
ఉదయం 10 గంటల సమయంలో పట్టణంలోని బుడంగుంట కాలనీ నుంచి పగడం శ్రీనివాసులు అనే వ్యక్తి తాను పెంచుకుంటున్న కోడి పుంజును తీసుకొని వచ్చాడు. ఆస్పత్రిలో వైద్యుడు లేరు. అయితే ఇంటర్న్‌షిప్ కోసం శిక్షణలో ఉన్న విద్యార్థి కోడి పుంజు తెచ్చిన వ్యక్తి వద్దకు చేరుకుని ఏమైందని ఆరా తీశాడు. కుక్క కరవడంతో కోడి పుంజు మెత్తపడిందని చెప్పడంతో ఆ విద్యార్థి ఇంజక్షన్లు వేసి పంపాడు.
మేక పిల్లకు జ్వరం..
ఉదయం 10.30 గంటలకు ముసునూరు నుంచి వారం రోజుల మేక పిల్లను సంకలో పెట్టుకుని పొట్లూరు శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చాడు. ఇంటర్న్‌షిప్ కోసం శిక్షణలో ఉన్న విద్యార్థి ఽసదరు వ్యక్తిని పలకరించడంతో మేక పిల్లకు జ్వరం వచ్చిందని చెప్పాడు. దీంతో ధర్మామీటర్‌తో మేక పిల్లను పరీక్షించి ఇంజక్షన్‌లు వేశాడు.
పశువైద్యశాలల్లో సరిగా అందని వైద్యం
పలుచోట్ల వైద్యుల కొరత
శిక్షణలో ఉన్న విద్యార్థుల చేతే సేవలు
కావలి రూరల్ మండలం చెంచుగానిపాలెం గ్రామానికి చెందిన యోగేందర్ డిప్లొమా ఇన్ వెటర్నరీ చేసి, రెండేళ్ల నుంచి కావలి పట్టణంలోని ప్రభుత్వ పశు వైద్యశాలలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. యోగేందర్‌కు ప్రభుత్వం జీతం రూపంలో పైసా ఇవ్వదు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే వైద్యుడు మాత్రం మూగ జీవాలే కదా.... ఎవరికీ చెప్పుకోలేవనే ధీమాతో ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది తేటతెల్లమౌతోంది.
Comments
Please login to add a commentAdd a comment