![రూ.2](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/12-02-2025_mr-1739301596-0.jpg.webp?itok=tGywjpov)
రూ.200 కోట్ల వరకూ కొల్లగొట్టిన మహబూబ్ సుభాని
● ఇప్పటికే ప్రజల నుంచి
రెండొందలకు పైగా ఫిర్యాదులు
● ఆందోళన చెందుతున్న బాధితులు
● కీలకంగా వ్యవహరించిన
ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
● ఏజెంట్లుగా మారిన పోలీసులు,
వారి కుటుంబ సభ్యుల పాత్రపై
ఉన్నతాధికారుల ఆరా
కావలి: కావలి కేంద్రంగా స్టాక్‌మార్కెట్ పేరుతో జరిగిన భారీ మోసం ప్రకంపనలు సృష్టిస్తోంది. గుంటూరుకు చెందిన సుభాని పట్టణ పరిధిలోని ముసునూరులో కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. స్టాక్‌మార్కెట్‌లో మెళకువలు, ట్రేడింగ్‌లో శిక్షణ పేరుతో అమాయకులకు వలవేసి, పోలీసు సిబ్బందిని, ప్రభుత్వ ఉద్యోగులను పావులుగా వాడుకుని ఏడాది కాలంలోనే రూ.200 కోట్ల వరకూ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత గడిచిన 48 గంటల్లోనే సుమారు 200 మందికిపైగా బాధితులు కావలి రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. కావలి పట్టణంతో పాటు కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాలు, కాలనీల నుంచి బాధితులు తండోప తండాలుగా కావలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదులు అందజేస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు, ఫిర్యాదులోని అంశాలను పోలీసులు ఎక్కడా బయటకు పొక్కనీయకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
బాధితులు ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.70 లక్షల వరకూ చెల్లించి మోసపోయారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువత, చిరువ్యాపారులు, చిరుద్యోగాలతో పొట్టపోసుకునే ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భారీగా పెట్టుబడులు పెట్టి నిండా మునిగిపోయారు. కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ వద్ద, ముసునూరులోని సంస్థ కార్యాలయం వద్ద బాధితులు తిండి తిప్పలు మానేసి విలపిస్తున్నారు. సుమారు రూ.40 లక్షల వరకూ అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన ధనలక్ష్మి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు జరిగిన మోసాన్ని తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ధనలక్ష్మి తరహాలోనే చాలా మంది బాధితులు ఆత్మహత్యలే గతి అన్నట్లుగా భోరున విలపిస్తున్నారు.
గోప్యంగా సాగుతున్న విచారణ
సుభానిని, కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నారు. ముసునూరులోని సుభాని ఇంటిని, కార్యాలయాన్ని తహసీల్దార్ సమక్షంలో మంగళవారం తెరిచి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, అకౌంటింగ్‌కు సంబంధించిన కీలక ఆధారాలు, ఏజెంట్ల వివరాలు మాయం చేసినట్లు గుర్తించారు. ట్రేడింగ్, పెట్టుబడుల పేరుతో సుభాని వసూలు చేసింది ఎంత? బాధితులకు తిరిగి చెల్లించింది ఎంత? మిగిలిన సొమ్ము అంతా ఎక్కడ ఉంది? బినామీ పేర్లతో స్థిరాస్తులు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, పోలీసులు ఇప్పటి వరకూ ఎంత వరకూ గుర్తించారు అనే వివరాలేవీ బయటకు రావడం లేదు.
పోలీసుల పాత్రపై ఉన్నతాధికారుల ఆరా...
బాధితుల్లో పెరుగుతున్న ఆందోళన
సుమారు రూ.200 కోట్ల మేర జరిగిన మనీస్కాం విషయంలో దర్యాప్తు సంస్థలు నెమ్మదిగా వ్యవహరిస్తుండటంపై బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వారం రోజులుగా దర్యాప్తు చేస్తున్నా ఇంత వరకూ ఎటువంటి వివరాలు వెల్లడించకపోవడం, ఆస్తులు గుర్తించకపోవడం, అంతా గోప్యంగా సాగుతుండటంతో బాధితులు విలవిలలాడిపోతున్నారు. ఈక్రమంలోనే ధనలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉన్నతాధికారులు స్పందించి దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రతీ రూపాయి వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని బాధితులు వేడుకుంటున్నారు. నగదు చెల్లించిన వాళ్లు, కమీషన్ ఏజెంట్‌గా వ్యవహరించిన వారు ఉన్నారు. అయితే ఈ దందా నిర్వహించిన సుభాని, ఏజెంట్లు ఎంత స్వాహా చేశారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు స్పష్టత ఇవ్వక పోవడంతో బాధితులు కుమిలిపోతున్నారు.
మనీస్కాంలో కొంత మంది పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కూడా కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత పెట్టుబడి పెట్టేందుకు సుభాని వద్దకు వెళ్లిన కానిస్టేబుళ్లు ఆ తరువాత ఏజెంట్లుగా మారినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సంస్థ ట్రేడింగ్ ద్వారా లాభాలు సాధించడం లేదని, మనీస్కాంకు పాల్పడుతుందని గుర్తించి అందిన కాడికి దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో కానిస్టేబుల్ ఒకరు ఒక సీఐకి, ఎస్సైకి రూ.40 లక్షలు పైచిలుకు వ్యయంతో ఫ్లాట్ కూడా కొనుగోలు చేసి ఇచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసుల పాత్రపై ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కావలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న వట్టికాల రాధాకృష్ణ, జ్యోతి అయోధ్య కుమార్‌లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
![రూ.200 కోట్ల వరకూ కొల్లగొట్టిన మహబూబ్ సుభాని 1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11kvl11r-240016_mr-1739301596-1.jpg)
రూ.200 కోట్ల వరకూ కొల్లగొట్టిన మహబూబ్ సుభాని
![రూ.200 కోట్ల వరకూ కొల్లగొట్టిన మహబూబ్ సుభాని 2](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11kvl09-240016_mr-1739301596-2.jpg)
రూ.200 కోట్ల వరకూ కొల్లగొట్టిన మహబూబ్ సుభాని
![రూ.200 కోట్ల వరకూ కొల్లగొట్టిన మహబూబ్ సుభాని 3](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11kvl05-240016_mr-1739301596-3.jpg)
రూ.200 కోట్ల వరకూ కొల్లగొట్టిన మహబూబ్ సుభాని
Comments
Please login to add a commentAdd a comment