రేపు పంపనూరులో కోటి దీపోత్సవం
ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంలో ఈ నెల 17న కోటి దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ బాబు శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకాలతో పాటు, తులసీదామోదర కల్యాణోత్సవం ఉంటుంది. సాయంత్రం ఆలయంలో విశేష హారతులు, జ్వాలా తోరణంతో పాటు కోటి దీపోత్సవం నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. తాగునీరు, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రాత్రి సమయాల్లో ఇబ్బంది పడకుండా ప్రత్యేక బస్సులనూ ఏర్పాటు చేశారు.
సత్ప్రవర్తనతో మెలగాలి
● జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ
కార్యదర్శి శివప్రసాదయాదవ్
ధర్మవరం అర్బన్/హిందూపురం: సత్ప్రవర్తనతో మెలుగుతూ విడుదలైన అనంతరం కుటుంబసభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.శివప్రసాదయాదవ్ సూచించారు. శుక్రవారం ఉదయం ధర్మవరం, హిందూపురంలోని సబ్ జైళ్లను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గది, స్టోర్ రూం, బ్యారక్‌లు, రికార్డులు పరిశీలించారు. ఖైదీలతో సమావేశమై అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కోర్టు కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాది లేకపోతే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హిందూపురంలో గాయాలతో ఇబ్బంది పడుతున్న ఖైదీలను గుర్తించి, వారికి తక్షణమే చికిత్స చేయించాలని సబ్‌జైలు అధికారి హనుమన్నకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ధర్మవరంలో సబ్‌జైలు సూపరింటెండెంట్ బ్రహ్మానందరెడ్డి, న్యాయవాది బాలసుందరి, జైలు సిబ్బంది, హిందూపురంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, న్యాయవాదులు సుదర్శన్, నవేరా, హెబ్సా, శివ, లోక్ అదాలత్ సిబ్బంది హేమవతి తదితరులు ఉన్నారు.
వ్యక్తిపై కత్తితో దాడి
ధర్మవరం అర్బన్: స్థానిక శివానగర్‌లో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. శివానగర్‌లోని ఒకే ఇంటిలో ఆచారి, శివ అద్దెకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి శివ మిద్దైపెకి వెళుతుండగా అక్కడే ఉన్న ఆచారి తనకు చెప్పకుండా పైకి ఎలా వెళ్తావంటూ శివతో గొడవ పడ్డాడు. ఆ సమయంలో మాటామాట పెరగడంతో ఆచారి ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకు వచ్చి శివపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గమనించిన శివ కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment