సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళల్లో రక్తహీనత (ఎనీమియా) ప్రధాన సమస్యగా మారింది. ఇది నియంత్రించడం, నివారించదగ్గదే అయినా సాధ్యం కావడం లేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్తహీనత సమస్యతో వేలాది మంది మహిళలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 15 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు మహిళల్లో ఈ లోపం ఎక్కువగా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. సగటున ప్రతి వందమందిలో 58 మందికి పైగా రక్తహీనత సమస్యతో సతమతమవుతున్నారు. సరైన పౌష్టికాహారం లేకపోవడం, దీన్ని నివారించేందుకు ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడం వల్ల అనేక జబ్బులకు గురవుతున్నారు. మహిళల్లో సగటున 11 శాతం హిమోగ్లోబిన్ ఉండాలి. కానీ 25 ఏళ్ల వయసున్న మహిళల్లో హిమోగ్లోబిన్ 8 శాతం కూడా లేని పరిస్థితి. చాలామంది మహిళలు రక్తహీనత కారణంగా జబ్బులకు గురైనప్పుడు త్వరగా కోలుకోలేకపోతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
గర్భిణుల్లో ప్రమాదక పరిస్థితులు
ఉమ్మడి జిల్లాలో ఏడాదికి 80 వేలకు వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో 55 శాతం మందికి పైగా రక్తహీనతతోనే బాధపడుతున్నారు. సివియర్ ఎనీమియా (అత్యల్పంగా రక్తం ఉండటం) వల్ల ప్రసవ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఐరన్, విటమిన్ మాత్రలు అందుబాటులో ఉండడం లేదు. యాంటీనేటల్ చెకప్ (గర్భిణిగా ఉన్నప్పుడు నెలసరి వైద్యపరీక్షలు)కు వచ్చినప్పుడు రక్తహీనత ఉన్నా...ఐరన్, విటమిన్ టాబ్లెట్లు ఇవ్వడం లేదని గర్భిణులు చెబుతున్నారు. రక్తహీనత వల్ల ఎక్కువ మంది సుఖ ప్రసవం కాలేకపోతున్నారు. అంతేకాదు ప్రసవ సమయంలో మాతృ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. స్టిల్ బర్త్ (కడుపులోనే బిడ్డ మృతి చెందడం) వంటివి జరుగుతూ తల్లికీ గండంగా మారింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సగటున 58 శాతం మందికి పైగా గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నట్టు తేలింది. సమయానికి ఆస్పత్రుల్లో ఐరన్, విటమిన్ మాత్రలు లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శారీరకంగా బలహీనంగా ఉండడం
శరీరం పసుపు రంగులో ఉండడం
శ్వాస సరిగా తీసుకోలేకపోవడం
ఛాతీలో అప్పుడప్పుడూ నొప్పి రావడం
అరచేతులు, అరికాళ్లు చల్లగా ఉండడం
తరచూ తలనొప్పి వస్తుండడం
Comments
Please login to add a commentAdd a comment