యానిమేటర్ల జీతాలు స్వాహా
శెట్టూరు: తమకు మంజూరైన జీతాలను కొత్త యానిమేటర్లు స్వాహా చేశారంటూ పాత యానిమేటర్ల వాపోయారు. ఈ మేరకు సోమవారం మండల ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం గంగన్నను పాత యానిమేటర్ల పార్వతమ్మ, గీతమ్మ, శివలింగమ్మ కలసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మే, జూన్ నెలలకు సంబంధించి తమకు మంజూరైన జీతాలు డ్రా చేసి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. దీనికి అక్కడే ఉన్న సీసీ లక్ష్మీపతి మాట్లాడుతూ.. సంబంధిత సీసీల సంతకాలు లేకుండా చెక్కులను కొత్త యానిమేటర్లు డ్రా చేసినట్లు వివరించారు. వారితో రికవరీ చేయించి చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ ఏడాది జూన్ నెల వరకు 33 మంది పాత యానిమేటర్లు పనిచేశారు. ప్రభుత్వం మారిన తర్వాత 28 మంది యానిమేటర్లను బలవంతంగా తొలగించి, వారి స్థానంలో జూలైలో కొందరిని, ఆగస్టులో మరికొందరిని నియమించారు. అప్పటి వరకూ శెట్టూరు, చెర్లోపల్లి, ములకలేడు, లక్ష్మంపల్లి క్లస్టర్లలో 33 మంది యానిమేటర్లు పనిచేశారు. వీరికి జూన్, జూలైకు సంబంధించి మంజూరైన జీతాలను కొత్తగా వచ్చిన సీసీలు, కొత్తగా ఏర్పడిన గ్రామ సమాఖ్య సంఘాల నేతలు కలిసి కొత్తగా వచ్చిన యానిమేటర్లకు కట్టబెట్టారు. మే, జూన్, జూలై నెలల్లో పనిచేయకపోయిన వారికి జీతాలు ఎలా చెల్లించారో అర్థం కావడం లేదంటూ పాత యానిమేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 4.48 లక్షల సొమ్ము పక్కదారి పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment