ఫిర్యాదులు వస్తేనే తనిఖీలు
సాక్షి, పుట్టపర్తి: మెడికల్ షాపులు.. ప్రొవిజన్ స్టోర్స్ మాదిరిగా ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతున్నాయి. ఫార్మసిస్టు లేకుండానే మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. ఆర్‌ఎంపీ కోసం క్లినిక్‌కు అద్దె చెల్లించి.. పక్కనే మరో రూములో మందులు (ఔషధాలు) అమ్ముతారు. పట్టణాల నుంచి మండల కేంద్రాలు, గ్రామ స్థాయి వరకు ఈ సంస్కృతి వ్యాపించింది. పర్యవేక్షణ లేకపోవడంతో మెడికల్ షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుని కార్యాలయానికే పరిమితం కావడంతో మెడికల్ దందా భారీస్థాయిలో జరుగుతోంది. ఫలితంగా ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. హిందూపురం నుంచి కొత్తచెరువు వరకు ప్రతిచోటా మెడికల్ షాపుల్లో గోల్‌మాల్ జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
రసీదు లేకుండానే మందులు..
జిల్లాలో పలు చోట్ల అర్హత లేకున్నా ఇతరుల సర్టిఫికెట్ల పేరు మీద మెడికల్ షాపులు నడుపుతున్నారు. అలాంటి చోట ఇంటర్ చదివిన వారిదే పెత్తనం. ఎలాంటి రసీదు లేకున్నా.. జబ్బు పేరు చెబితే మందులు అమ్ముతారు. ఏదైనా సమస్య వస్తే ఇబ్బంది అవుతుందని, దాని నుంచి బయటపడేందు కోసం కొనుగోలు చేసినట్టు బిల్లు ఇవ్వడం లేదు. ఈ షాపుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించే వాటిలో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అధికంగా ఉంటున్నాయి. డాక్టర్లతో సంప్రదించకుండానే చాలామంది ఆయా మందులు వాడి ఆరోగ్యం మరింత పాడుచేసుకుంటున్నారు. అయితే డ్రగ్స్ కంట్రోలర్‌లు ఎక్కడ ఉన్నారో? ఏం చేస్తున్నారో? ప్రజలకు తెలియడం లేదు. హిందూపురంలోని ఆఫీసులో అధికారి ఏ రోజూ కనిపించడని చెబుతున్నారు. నెలకు ఒకట్రెండు రోజులు మాత్రమే వచ్చి వెళ్తారని తెలిసింది.
హిందూపురంలోని ఓ ప్రైవేటు మెడికల్ షాపులో ఇద్దరు వ్యక్తులు వెళ్లి కొన్ని మందులు కొన్నారు. బిల్లు రూ.573 అయ్యింది. మందులు తీసుకుని నగదు చెల్లించారు. బిల్లు అడిగితే షాపు నిర్వాహకుడు నిరాకరించాడు. బిల్లు ఇవ్వడం కుదరదని.. తాను కూలి కోసం పని చేసే వ్యక్తి మాత్రమేనని సమాధానం ఇచ్చాడు.
కొత్తచెరువులో ఓ ప్రైవేటు క్లినిక్ పక్కనే మెడికల్ షాపు ఉంది. డాక్టర్ మందులు రాసి ఇస్తారు. షాపులో వెళ్లి తీసుకుంటే డాక్టర్ ఫీజుతో సహా మొత్తం వసూలు చేస్తారు. పైగా ఎలాంటి బిల్లు ఇవ్వడం లేదు. ఇదేంటని అడిగితే ఇష్టం ఉంటే రండి.. లేదంటే ఇంకోచోటకు వెళ్లండని సమాధానం ఇస్తున్నారని బాధితులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల రసీదులు (బిల్లులు) లేకుండా మందులు విక్రయిస్తున్నారు. ఆయా మందులు తిని చాలామంది లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. నివారించాల్సిన డ్రగ్స్ కంట్రోలర్స్ ఏడాదికి ఒకసారి కూడా తనిఖీలు చేయకపోవడంతో మెడికల్ షాపు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
మెడికల్ షాపుల నిర్వహణలో అవకతవకలపై ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. బాధితులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా తనిఖీలు చేస్తాం. బిల్లులు ఇవ్వని.. అర్హత లేని వారిపై చర్యలకు సిఫారసు చేస్తాం. అనుమతులు లేని దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేస్తాం. మందులు కొన్నవారికి బిల్లు అడిగే హక్కు ఉంటుంది. అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రజలకు మందులు అమ్మరాదు.
– రమేశ్‌రెడ్డి, డ్రగ్స్ కంట్రోలర్
Comments
Please login to add a commentAdd a comment