దడ పుట్టిస్తున్న వరుస నేరాలు
మడకశిర : కర్ణాటకకు సరిహద్దున ఉన్న మడకశిర నియోజకవర్గంలో ఇటీవల నేరాలు పెరిగాయి. ఒకదాని తర్వాత మరొకటి నమోదవుతూనే ఉన్నాయి. విద్యార్థుల అదృశ్యం, కిడ్నాప్ ఘటనలతో పాటు లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. దొంగలు కూడా రెచ్చిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేరాల నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. రెండు వారాల వ్యవధిలో చోటు చేసుకున్న పలు సంఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మడకశిర మండలం ఆమిదాలగొంది జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న చేతన్‌కుమార్‌ను నవంబర్ చివరి వారంలో కిడ్నాప్ చేసి.. దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో హెచ్‌ఎం నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులు ఈ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి, నిందితులను అరెస్ట్ చేశారు. మడకశిరలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిపై అధ్యాపకుడు వేధింపులకు పాల్పడిన ఘటన వారం రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం మడకశిర పట్టణంలోని చౌటిపల్లి ప్రాథమిక పాఠశాల వద్ద ఐదో తరగతి, నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. ఐదు రోజుల క్రితం మడకశిరలో దొంగలు హల్‌చల్ చేశారు. కారులో వచ్చి మెడికల్ తదితర ఆరు షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు.
బాలిక ఆచూకీ కోసం ఆందోళన..
పట్టణ పరిధిలోని బేగార్లపల్లిలో ఇంటర్ చదువుతున్న బాలిక కిడ్నాప్‌కు గురైంది. మరుసటి రోజే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు రోజులైనా బాలిక ఆచూకీ కనిపెట్టలేదని తల్లిదండ్రులు, బంధువులు సోమవారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అంతకు మునుపు బాలిక కిడ్నాప్ ఘటనపై మనస్తాపం చెందిన తల్లి ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తర్వాత స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న సమయంలో తండ్రి కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించగా బంధువులు అడ్డుకుని రక్షించారు.
మడకశిర నియోజకవర్గంలో
టెన్షన్ టెన్షన్
కిడ్నాప్‌లు, లైంగిక వేధింపులు,
చోరీల కలకలం
పోలీసుల వైఫల్యంపై మండిపడుతున్న ప్రజలు
కఠిన చర్యలు తీసుకుంటాం
నియోజకవర్గంలో నేరాలు నివారించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థి చేతన్‌కుమార్ హంతకులను కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశాం. పట్టణంలో చోరీలు జరగకుండా గస్తీ ఏర్పాటు చేస్తాం. కిడ్నాప్‌నకు గురైన బాలిక ఆచూకీ కనిపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది కొరత అధికంగా ఉంది. ఫలితంగా నేరాల నివారణకు కొంత వరకు ఇబ్బందులు పడుతున్నాం.
– రాజ్‌కుమార్, సీఐ, మశికశిర
Comments
Please login to add a commentAdd a comment