పల్లె ప్రోద్బలంతోనే అక్రమ కేసు
పుట్టపర్తి టౌన్: మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రోద్బలంతోనే తనతో సహా నలుగురిపై అక్రమ కేసులు బనాయించారని బుక్కపట్నం మండలం మారాలకు చెందిన ఈదులపల్లి రామ్మోహన్ ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతో మేకల గౌతమ్ ఆత్మహత్య చేసుకుంటే.. తమకెలాంటి సంబంధమూ లేకపోయినా రాజకీయ కక్షలను మనసులో ఉంచుకుని ఇరికించారని, సమగ్ర విచారణ చేసి.. తమకు న్యాయం చేయాలని ఎస్పీ రత్నను కోరారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పెన్నోబులేసు, దళిత సంఘాలు, వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి రామ్మోహన్ తదితరులు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో తమను కేసులో ఎలా ఇరికించారనే విషయాలను వెల్లడించారు. ‘నవంబర్ రెండో తేదీ రాత్రి మారాలకు చెందిన మేకల నారాయణస్వామి కుమారుడు గౌతమ్ తన నివాసంలో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే ఆరు నెలల కిందట మొహర్రం వేడుకల్లో జరిగిన చిన్నపాటి గొడవ నేపథ్యంలో నారాయణస్వామి కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను రాజీ చేసి కేసు ముగించారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేశానని నాతో పాటు మరో ముగ్గురిని రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి పల్లె, టీడీపీ నాయకులు కుట్ర పన్ని గౌతమ్‌తో వాంగ్మూలం ఇప్పించి కేసు నమోదు చేయించారు’ అని రామ్మోహన్ వివరించారు. అక్రమ కేసు కారణంగా నాలుగు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించి, సిట్ ద్వారా విచారణ చేయించి తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. ఇందుకు ఎస్పీ సానుకూలంగా స్పందించి డీఎస్పీ ద్వారా మరోసారి విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, పతంజలి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ కక్షలతో
కేసుల్లో ఇరికించారు
న్యాయం కోసం
ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment