డ్రోన్ వ్యవసాయం
అద్దెల భారం...
మడకశిర: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయంలో నూతన ఒరవడి సృష్టించాలని కూటమి సర్కార్ పిలుపునిస్తున్నా... ఆ దిశగా క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతన్న కష్టాలు తీరడం లేదు. ఆధునిక సాంకేతికత వైపు ఆసక్తి ఉన్న అందుకయ్యే ఖర్చు తలుచుకుని బెంబేలెత్తిపోతున్నారు.
నేడు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా కూటమి ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. ప్రధానంగా పంటలకు మందులను పిచికారీ చేయడానికి రైతులు డ్రోన్‌లను అద్దెకు తెచ్చుకుంటున్నారు. కూలీల అవసరం లేకుండా డ్రోన్‌ల ద్వారా మందులను పిచికారీ చేపడితే సమయం ఆదా అవుతుందని అధికారులు సైతం అవగాహన కల్పిస్తున్నారు. గంటకు 3 ఎకరాల విస్తీర్ణంలో పంటకు పురుగుల మందును పిచికారీ చేయడం రైతులకు కలిసివచ్చే అంశమే అయినా... డ్రోన్‌ల అద్దె భారం భరించలేకపోతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా స్థానికంగా రైతులకు డ్రోన్‌లు అద్దెకు దొరకడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. డ్రోన్ యజమానులు గంటకు రూ.800 నుంచి రూ. వెయ్యి వరకూ అద్దె వసూలు చేస్తున్నారు. ప్రభుత్వమే డ్రోన్‌లను రైతులకు వందశాతం సబ్సిడీతో సరఫరా చేస్తే ఎంతో వెసులుబాటు ఉంటుందని రైతులు కోరుతున్నారు. లేకుంటే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను అందుబాటులో ఉంచినట్లుగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆర్‌ఎస్‌కేల ద్వారా డ్రోన్‌లనూ అందివ్వాలని కోరుతున్నారు.
నాడు అన్నింటా ప్రోత్సాహం
ప్రధానంగా వ్యవసాయ పనులకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటోంది. విత్తు మొదలు పంట కోత వరకూ కూలీలు లేనిదే పనులు ముందుకు సాగవు. అయితే ప్రస్తుత రోజుల్లో కూలీల కొరత ఎక్కవగా ఉండడంతో వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కూలీలకు చాలా డిమాండ్ పెరిగింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆధునికి వ్యవసాయ పద్ధతుల వైపు రైతులు దృష్టి సారించారు. దీంతో సమయం ఆదా కావడమే కాకుండా ఆర్థిక భారం కూడా తగ్గుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వచ్చింది. గ్రామాల్లోనే రైతులకు అందుబాటులోకి తీసుకుచ్చిన ఒక్కో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రానికి ఒక్కో ట్రాక్టర్‌తో పాటు వివిధ వ్యవసాయ పరికరాలను అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందుబాటులో ఉంచారు. అవసరమున్న రైతులు అతి తక్కువ అద్దె చెల్లించి ఆయా యంత్ర పరికరాలను తీసుకెళ్లి వ్యవసాయంలో వినియోగించుకుని తిరిగి ఆర్‌బీకేలకు అప్పగిస్తూ వచ్చారు. రైతు భరోసా పథకం ద్వారా సీజన్‌కు ముందే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.13,500ను పెట్టుబడి సాయం కింద వైఎస్ జగన్ అందజేస్తూ వచ్చారు. సమయానికి పంటల బీమా, పంటల నష్టపరిహారాన్ని అందించడంతో అప్పట్లో వ్యవసాయం సుసంపన్నమైంది.
పంటల్లో చీడపీడల నివారణకు డ్రోన్‌ల ద్వారా మందుల పిచికారీ
అద్దె ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది
ఆర్‌ఎస్‌కేల్లో అందుబాటులో
ఉంచాలంటూ రైతుల విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment