వాటర్ ప్లాంట్ తరలింపులో ఉద్రిక్తత
చిలమత్తూరు: ఇరు గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను బలవంతంగా మరో ప్రాంతానికి తరలించడం వివాదాస్పదమైంది. వివరాలు.. చిలమత్తూరు మండలం సోమఘట్ట పంచాయతీలోని చెరువుకిందపల్లి వద్ద ప్రభుత్వ భూమిలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ద్వారా చెరువుకిందపల్లి, ఎస్.కొత్తపల్లి గ్రామాల ప్రజలు ప్యూరిఫైడ్ వాటర్‌ను తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాటర్ ప్లాంట్‌ను అక్కడి నుంచి తరలించేందుకు కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకు సోమఘట్ట పంచాయతీ కార్యదర్శి, ఇన్‌చార్జ్ ఈఓఆర్డీ ప్రభుదాస్ తోడయ్యారు.
పంచాయతీ తీర్మానం లేకుండానే..
ప్రజాప్రయోజనార్థం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను తరలించాలంటే పంచాయతీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఇన్‌చార్జ్ ఈఓఆర్డీ ప్రభుదాస్‌మంగళవారం వాటర్ ప్లాంట్‌ను అక్కడి నుంచి తొలగించారు. విషయం తెలుసుకున్న చెరువుకిందపల్లి, ఎస్.కొత్తపల్లి వాసులు అక్కడకు చేరుకుని ప్లాంట్ తరలింపును అడ్డుకున్నారు. ఆ సమయంలో స్థానికులపై ప్రభుదాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు దిగాడు. అక్కడితో ఆగకుండా పోలీసులను పిలిచించి హంగామా చేశాడు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుని పరిస్థితి అదుపుతప్పింది. ఎస్‌ఐ మునీర్ అహమ్మద్ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. గొడవ జరుగుతోందని ప్రభుదాస్ ఫోన్ చేయడంతో తాము వచ్చామని, అయితే ఇక్కడ అలాంటి పరిస్థితి ఏదీ లేకపోవడంతో వెనుదిరిగి వెళుతున్నట్లు ఎస్‌ఐ పేర్కొనడం గమనార్హం.
సార్ చెప్పారు... నేను చేశా
ప్లాంట్‌ను అక్కడి నుంచి తరలించాలంటూ ఎంపీడీఓ రమణమూర్తి తనకు ఆదేశాలిచ్చారని, దీంతో తాను అక్కడి ఉంచి ప్లాంట్‌ను తొలగిస్తున్నట్లు ప్రభుదాస్ చెప్పుకొచ్చాడు. అయితే ఇదే విషయంపై ఎంపీడీఓ మాట్లాడుతూ.. తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విలేకరులు ప్రభుదాస్‌కు తెలపడంతో ‘నాకు టీడీపీ నేతల అండ ఉంది, మీ ఇష్టమొచ్చింది రాసుకోండి, నన్నెవరూ ఏమీ చేయలేరు’ అంటూ కవ్వింపు చర్యలకు దిగాడు.
గ్రామస్తులు అడ్డుకున్నా బలవంతంగా తరలించిన ఈఓఆర్డీ
ప్లాంట్ తరలింపునకు తామెలాంటి ఆదేశాలివ్వలేదన్న ఎంపీడీఓ
అక్కడుంటే నష్టమేంటి?
రెండు గ్రామాలకు అనుకూలంగా ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను కేవలం రాజకీయ ప్రోద్బలంతోనే తరలిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తే ఇన్‌చార్జ్ ఈఓఆర్డీ బెదిరిస్తున్నాడు. అసలు ప్లాంట్ అక్కడుంటే వారికొచ్చే నష్టమేంటో అర్థం కావడం లేదు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉందనే అప్పట్లో ప్లాంట్‌ను అక్కడ ఏర్పాటుకు అంగీకారం తెలిపాం. ఈఓఆర్డీ వ్యవహారం బాగోలేదు.
– వలసరెడ్డి, చెరువుకిందపల్లి
కలెక్టర్ చొరవ తీసుకోవాలి
ఊర్లో కొందరి మాటలు విని ప్లాంట్‌ను ఈఓఆర్డీ దౌర్జన్యంగా మరో ప్రాంతానికి మార్చేస్తున్నాడు. పోలీసులను పిలిపించి దౌర్జన్యానికి దిగడమేంటో అర్థం కావడం లేదు. మెజారీటీ ప్రజల అభిప్రాయం కన్నా వీళ్లకు రాజకీయాలే ముఖ్యమయ్యాయి. దీనిపై కలెక్టర్ చొరవ తీసుకోవాలి.
– పుష్పవతి, చెరువుకిందపల్లి
Comments
Please login to add a commentAdd a comment