ఉరవకొండ: స్థానిక 5వ సచివాలయ పరిధిలో ఆశా కార్యకర్తగా పని చేస్తున్న శర్మాస్‌బీ ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గత రెండేళ్లుగా ఎంఎల్‌హెచ్‌పీ సులోచన వేధిస్తోందని, ఈ వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది వివిధ రకాల మాత్రలను శర్మాస్‌బీ మింగిందని పోలీసులకు భర్త శర్మష్ ఫిర్యాదు చేశాడు. విధుల్లో ఉన్న తన భార్యపై పలు మార్లు ఆమె చెయ్యి కూడా చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె వేధింపులు తాళలేక సచివాలయంలోనే వివిధ రకాల మాత్రలను ఆమె మింగినట్లు వివరించాడు. కాగా, చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
టీడీపీ కార్యకర్తల బాహాబాహీ
పెద్దవడుగూరు: మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో మంగళవారం టీడీపీ కార్యకర్తలు బాహాబాహీగా తలపడ్డారు. గ్రామంలో ఉదయం తహసీల్దార్ ఉషరాణి ఆధ్వరంయలో రెవెన్యూ సదస్సు జరిగింది. మధ్యాహ్నం అధికారులు భోజనానికి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు యల్లావుల రామన్న అలియాస్ రమణపై దాదా, జాకీర్, రసూల్ మరో ఇరువురు దాడి చేశారు. రామన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గత కొన్ని రోజులుగా గ్రామంలో రేషన్‌షాపు నిర్వహణ అంశంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ క్రమంలోనే దాడులు చోటు చేసుకున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. ఘటనపై బాదితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
యువకుడి బలవన్మరణం
రాయదుర్గం టౌన్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన కుండ రామన్న కుమారుడు గంగాధర్ (28) వ్యవసాయ కూలి పనులతో ఇంటికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొన్ని రోజుల క్రితం తల్లి అంజినమ్మ ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుదేలైన గంగాధర్ కూడా రెండు రోజుల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాయదుర్గం రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం వేకువజామున పట్టాల మధ్య పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన గ్యాంగ్‌మెన్ సమాచారంతో గుంతకల్లు జీఆర్పీ ఎస్‌ఐ మహేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
దేశంలో మానవహక్కుల ఉల్లంఘన
● పౌర చైతన్య వేదిక ప్రదర్శనలో వక్తలు
అనంతపురం అర్బన్: ‘దేశంలో యఽథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ప్రజాస్వామిక హక్కులు, లౌకికవాదం, మానవహక్కులను ప్రస్తుత పాలకులు హరిస్తున్నారు. మరోవైపు మహిళలు, బాలికలు, పిల్ల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయి’ అని విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ డి.గోవిందరాజులు, మానవ హక్కుల వేదిక జిల్లా ఇన్‌చార్జి డి.రాఘవేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినం సందర్భంగా వేదిక ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద నాయకులు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా గోవిందరాజులు, రాఘవేంద్ర మాట్లాడారు. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన ప్రతి రంగంలోనూ కనిపిస్తోందన్నారు. అదే క్రమంలో అత్యాచారాలు పెరిగాయన్నారు. ప్రభుత్వాలు ప్రజల గొంతును నొక్కేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మానవ హక్కుల ఉల్ల్లంఘనలను అడ్డుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment