భక్తుల కొంగుబంగారం బాబయ్యస్వామి
పెనుకొండ: భక్తుల కొంగుబంగారంగా పెనుకొండ బాబయ్యస్వామి దర్గా విరాజిల్లుతోంది. బాబయ్యస్వామిని దర్శించుకుంటే కష్టాలు తీరుతాయని, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా నిర్వహించే దర్గా ఉరుసు ఉత్సవాలకు హిందువులు, ముస్లింలు పెద్ద ఎత్తున హాజరవుతారు. మత సామరస్యాన్ని చాటే దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 13న ప్రారంభం కానున్నాయి. శుక్రవారం రాత్రి 9 గంటలకు సర్వమత సమ్మేళనం నిర్వహించనున్నారు. అన్ని మతాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. అన్ని మతాల సారాంశం ఒక్కటే అన్న సందేశాన్నిస్తారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము వరకు దర్గా పీఠాధిపతి తాజ్‌బాబా నేతృత్వంలో గంధం వేడుకలు కొనసాగుతాయి. ఈ పరంపరలో మొదటి గంధం వేడుకలను బాబయ్య స్వామి వంశీకులు సజ్జద్‌బాబా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తుల కోలాహలం, ఫకీర్ల విన్యాసాలు మత పెద్దలు వెంటరాగా పీఠాధిపతి గంధం వేడుకల సందల్ మహల్ నుంచి కార్యక్రమాన్ని చేడుతారు. బాబయ్య సమాధికి గంధాన్ని అవనతం చేయడంతో ప్రత్యేక ప్రార్థనల అనంతరం గంధం వేడుకలు ముగుస్తాయి. అనంతరం 15 రోజులకు పైగా ఉరుసు కొనసాగుతుంది. కార్యక్రమంలో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. దర్గా నిర్వహకులతో పాటు మున్సిపల్ అధికారులు భక్తులకు తాగునీరు. మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడానికి చకచకా ఏర్పాట్లు చేపట్టారు.
13న గంధం వేడుకలు, సర్వమత సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment