లో ఓల్టేజీ సమస్యపై రైతుల ధర్నా
అగళి: లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలంటూ అగళి మండలం హెచ్‌డీహళ్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట గురువారం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు రామకృష్ణ, నరసింహరాజ్, అశ్వత్థ, తిప్పేస్వామి, వసంత, మంజునాథ్, లక్ష్మీనారాయణ, వీరభద్ర తదితరులు మాట్లాడారు. లో ఓల్టేజీ సమస్య కారణంగా వారానికి రెండు మూడు సార్లు తమ సబ్మెర్సిబుల్ మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చులేక పోతున్నామని, తాజాగా మోటార్లు కాలిపోతుండడంతో వాటి మరమ్మతకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందని మండిపడ్డారు. ఏదైనా విద్యుత్ సమస్య తలెత్తితే పరిష్కరించే వారే లేరని వాపోయారు. సమస్య పరిష్కారం కోరుతూ ఇప్పటికే మూడు సార్లు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనలు చేపట్టామని గుర్తు చేశారు. అయినా అధికారులు స్పందించక పోవడం బాధాకరమన్నారు. రోజూ మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, అది కూడా లో ఓల్డేజ్ కారణంగా మోటార్లు ఆడడం లేదన్నారు. ఇప్పటికై నా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఇన్‌చార్జ్ ఏఈ నిజాముద్దీన్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో దాదాపు 50 మందికి పైగా రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment