నవోదయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి ఈనెల 18న నిర్వహించే రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు, నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఏ చిన్నపొరబాటుకు తావివ్వొద్దని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను డీఈఓ ఆదేశించారు. గురువారం అనంతపురంలోని ఉపాధ్యాయ భవనంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ, నవోదయ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,987 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అనంతపురం జిల్లాలో 15, శ్రీసత్యసాయి జిల్లాలో 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 18న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు గంటముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని డీఈఓ ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment