కశ్మీర్‌లో ధర్మవరం జవాను మృతి
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణానికి చెందిన బీఎస్‌ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ కాశ్మీర్‌లో బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. బంధువుల వివరాల మేరకు... ధర్మవరం పట్టణం నాగులబావివీధికి చెందిన వెంకట రమణారెడ్డి(40) బీఎస్‌ఎఫ్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా కశ్మీర్ బార్డర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విధుల్లో ఉన్న వెంకటరమణారెడ్డి గుండెపోటుకు గురై మృతి చెందాడు. వెంటనే బీఎస్‌ఎఫ్ వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించినా ఫలితం లేకపోయిందని అధికారులు తెలిపారు. సమాచారాన్ని బీఎస్‌ఎఫ్ అధికారులు ధర్మవరంలోని వెంకట రమణారెడ్డి కుటుంబ సభ్యులకు తెలిపారు. వెంకట రమణారెడ్డికి భార్య హరిప్రియ, కుమారుడు మహిధర్‌రెడ్డి, కుమార్తె రిత్విక ఉన్నారు. వెంకట రమణారెడ్డి భౌతికకాయం గురువారం రాత్రి ధర్మవరానికి చేర్చారు. వెంకట రమణారెడ్డి స్వగ్రామం చెన్నేకొత్తపల్లి మండలం బసినేపల్లిలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment