ఆదాయం మిన్న
పుట్టపర్తి అర్బన్: వాణిజ్య పంటల సాగులో లాభాలు ఆర్జిస్తున్న రైతులు ఈ రబీ సీజన్‌లో మొక్కజొన్న సాగుపై అమితాసక్తి చూపారు. పెట్టుబడులు తక్కువ... లాభాలు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పెనుకొండ వ్యవసాయ డివిజన్ పరిధిలో ఖరీఫ్, రబీల్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4 వేల హెక్టార్లు కాగా, ఈ ఏడాది 7,217 హెక్టార్లకు ఎగబాకడం గమనార్హం.
120 రోజుల్లో పంట చేతికి..
జిల్లా వ్యాప్తంగా రబీలో అత్యధికంగా సాగు చేసే మొక్కజొన్న 110 రోజుల నుంచి 120 రోజుల్లోపు పూర్తవుతుంది. ఇందులో అత్యధికంగా కావేరి 333, కావేరి బంపర్, డీకే, అడ్వాంటా తదితర విత్తన రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎకరాకు 8 కిలోల విత్తనం అవసరం కాగా, నాలుగు కిలోల బ్యాగ్ ధర రూ.1,600 నుంచి రూ.2వేల చొప్పున రైతులు కొనుగోలు చేశారు. ఒక ఎకరా విస్తీర్ణంలో పంట సాగు చేస్తే కనీసం 20 నుంచి 30 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది. ఖరీఫ్ చివర్లో మొక్కజొన్న క్వింటా ధర ఏకంగా రూ.2,800 వరకూ పలికింది. ఈ రబీలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటకు క్వింటాకు రూ.1,850 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఎకరా విస్తీర్ణంలో పంట సాగుకు రూ.2 వేల వరకూ ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. విత్తు వేసిన తర్వాత కలుపు నివారణ మందు పిచికారీ చేయడం, సస్యరక్షణలో భాగంగా కత్తెర పురుగు నివారణకు కాస్తా ఖర్చు వస్తుంది. పంట పూర్తయిన తర్వాత యంత్రాల సాయంతోనే కోస్తున్నారు. దిగుబడిని రెండు మూడు రోజులు ఆరబెట్టి మార్కెట్‌కు తరలిస్తున్నారు.
మొక్కజొన్న సాగుపై రైతుల ఆసక్తి
ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి
Comments
Please login to add a commentAdd a comment