ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దండి : ఆర్టీసీ ఆర్‌ఎం
పుట్టపర్తి టౌన్: రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా జిల్లాను ప్రమాదరహితంగా తీర్చి దిద్దాలని ఆర్టీసీ డ్రైవర్లకు ఆ సంస్థ ఆర్‌ఎం మధుసూదన్ సూచించారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను డిపో మేనేజర్ ఇనాయతుల్లాతో కలసి గురువారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. డ్రైవర్లు తగినంత విశ్రాంతి తీసుకొని ఏకాగ్రతతో బస్సులు నడపాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌చార్జ్ హరిత, గ్యారేజ్ ఇన్‌చార్జ్ విజయానంద్, సూవర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల భవనాల పరిశీలన
మడకశిర రూరల్: మండలంలోని గుండుమల గ్రామంలో ఉన్న బీసీ బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణాలను గురువారం బీసీ వెల్పేర్ ఎండీ దేవేందర్‌రెడ్డి, ఎస్‌ఈ శివకుమార్, ఈఈ రమణారెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు ఎంత మేర పూర్తి చేశారని స్థానిక అధికారులతో ఆరా తీశారు. నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
బ్యాంక్ ఖాతా నుంచి నగదు అపహరణ
ముదిగుబ్బ: మండల కేంద్రంలో సైబర్ నేరం జరిగింది. ముదిగుబ్బకు చెందిన నాగార్జునకు స్థానిక యూనియన్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఈ 14న ఉదయం ఆయన ఖాతా నుంచి రూ.32వేలను ఆయనకు తెలియకుండా సైబర్ నేరగాళ్లు అపహరించారు. విషయాన్ని పసిగట్టిన ఖాతాదారుడు గురువారం బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నీటి చౌర్యాన్ని అరికట్టాలి
అనంతపురం సెంట్రల్: పీఏబీఆర్ కుడికాలువ కింద అన్ని చెరువులను నీటితో నింపాలని జిల్లా పండ్లతోటల రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌ను కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. పీఏబీఆర్ నుంచి కుడి కాలువ ద్వారా చెరువులకు విడుదల చేసిన నీటిని ఇటీవల పరిశీలించినట్లు తెలిపారు. అయితే కూడేరు మండలం సమీపంలో ఉదిరిపికొండ, వడ్డుపల్లి తదితర ప్రాంతాల్లో కొంతమంది కాలువకు గండ్లు కొట్టి నీటిని అనధికారికంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. దీని వల్ల దిగువ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వెంటనే నీటి చౌర్యాన్ని అరికట్టాలని విన్నవించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అనంతరాముడు, నారపరెడ్డి, ఆనంద్, మురళీమోహన్ చౌదరి, వెంకటేశ్‌చౌదరి, చల్లా రామాంజనేయులు, రంగాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment