బైక్‌ను ఢీకొన్న కారు
బత్తలపల్లి: స్థానిక జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు... తాడిమర్రికి చెందిన బండారు రాముడు ద్విచక్రవాహనంపై గురువారం ముదిగుబ్బ మండలం గొంగటిలింగాయపల్లిలో సమీప బంధువుల ఇంట శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన బత్తలపల్లి మండలం రామాపురం కూడలి వద్ద జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా అనంతపురం నుంచి కదిరి వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఘటనలో రాముడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రునికి స్థానికులు సపర్యలు చేసి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రైలు కింద పడి
గుర్తు తెలియని వ్యక్తి మృతి
హిందూపురం అర్బన్: స్థానిక జీఆర్పీ పరిధిలోని హిందూపురం–మలగూరు స్టేషన్ల మధ్య గురువారం ఉదయం 9 గంటల సమయంలో రైలు కింద పడి ఓ వ్యక్తి (40) మృతి చెందాడు. ఈ మేరకు జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీ నాయక్ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. రైలు దూసుకెళ్లడంతో మృతదేహం ఛిద్రమైనట్లుగా తెలిపారు. వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే 93988 66299కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు.
నెట్టికంటుడిని దర్శించుకున్న రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్
గుంతకల్లు రూరల్: రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ పి.హరినాథ్‌గుప్త, తెలంగాణ రాష్ట్ర ఆదిలాబాద్ జిల్లా మాజీ ప్రిన్సిపల్ జడ్జి జి.గోపాలకృష్ణ... గురువారం సాయంత్రం కసాపురం నెట్టికంటి స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment