మట్టి దొంగకే ‘మైనింగ్’ మద్దతు!
చిలమత్తూరు: వడ్డించేవాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి అనేది నానుడి. అచ్ఛం ఇలాగే మారింది ఓ ఎస్‌ఐ అక్రమ మట్టి తవ్వకాలపై విచారణ. రాప్తాడు నియోజకవర్గంలో పని చేస్తున్న ఎస్‌ఐ మట్టి అక్రమ తవ్వకాలపై ‘పోలీసే మట్టి దొంగ’ శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’లో వెలువడిన కథనం విదితమే. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్ అధికారులు తీరుబడిగా ఈ నెల 9న హబ్ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని గుట్టుచప్పడు కాకుండా పరిశీలించి వెళ్లారు. అనంతరం సంక్రాంతి సెలవులు రావడంతో ఈ విషయాన్ని స్థానికులు మర్చిపోతారనే భావించారు. విచారణను సైతం నామమాత్రంగానే నిర్వహించి, వివరాలను గోప్యంగా ఉంచారు. సదరు ఎస్‌ఐ కొనుగోలు చేసిన భూమి వాలుగా ఉండడంతో దానిని చదును చేసేందుకు ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న లేపాక్షి నాలెడ్జి హబ్‌లోని భూముల నుంచి వందలాది టిప్పర్ల మట్టిని వారం రోజుల పాటు తరలించారు. జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన పోలీసు అధికారినే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ కోర్టు పరిధిలోని భూముల్లో అక్రమంగా చేపట్టిన మట్టి తవ్వకాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోడూరు వద్ద ఇలాగే ఓ భూ యజమాని అక్రమంగా మట్టి తరలించడంతో రూ. 2 కోట్ల మేర జరిమానా విధించారు. అయితే ఎస్‌ఐపై మాత్రం ఎలాంటి చర్యలూ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల అండతోనే మట్టి అక్రమ తరలింపుల వ్యవహారం నీరుగారిపోయిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. తన అక్రమాలపై కథనం ప్రచురితం కాగానే సదరు ఎస్‌ఐ ఆగమేఘాలపై ఇద్దరు ఎమ్మెల్యేలను ఆశ్రయించి ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకెళ్లినట్లగా తెలుస్తోంది. దీంతో మనోడే కదా అని వదిలేస్తారా? లేదా చర్యలు తీసుకుంటారా? అనేది వేచి చూడాలి.
లేపాక్షి హబ్‌లో ఆ పోలీసు మట్టి అక్రమ తవ్వకాలపై నామమాత్రపు విచారణ
Comments
Please login to add a commentAdd a comment