పాడి ఆవును బలిగొన్న ప్లాస్టిక్ వ్యర్థాలు
పుట్టపర్తి అర్బన్: ప్లాస్టిక్ వ్యర్థాలు తిన్న ఓ పాడి ఆవు మృతి చెందింది. వివరాలు.. పుట్టపర్తి మండలం గువ్వలగుట్టపల్లికి చెందిన గోపాలరెడ్డి ప్రభావతి దంపతులు పాడి పోషణతో జీవనం సాగిస్తున్నారు. గత ఏడాది రూ.80 వేలు వెచ్చించి ఓ ఆవును కొనుగోలు చేశారు. రోజూ పది లీటర్ల మేర పాలు ఇస్తున్న ఈ ఆవు వారం రోజులుగా మేత మేయక తీవ్ర అనారోగ్యం బారిన పడింది. గోరంట్లకు చెందిన పశు వైద్యుడు శివారెడ్డితో చికిత్స చేయించారు. అయినా ఫలితం దక్కక ఆదివారం మృత్యువాతపడింది. ఈ క్రమంలో ఆవు మృతికి కారణాలు అన్వేషిస్తూ పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ఆవు పొట్ట నిండా ప్లాస్టిక్ వ్యర్థాలు, చీరలతో పేనిన తాడు వ్యర్థాలు బయటపడ్డాయి. గమనించిన రైతు దంపతుల బోరున విలపించారు.
మండ్లిపల్లిలో భారీ చోరీ
తనకల్లు: మండలంలోని మండ్లిపల్లిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దుండగులు పెద్ద మొత్తంలో నగదు, అదే స్థాయిలో బంగారం, వెండి వస్తువులను అపహరించారు. మండ్లిపల్లికి చెందిన మల్లికార్జునరెడ్డి, పద్మావతి దంపతులు తమ కుమారుడు మహేష్‌రెడ్డి, కోడలు రోషిణి, మనుమరాలితో కలసి ఈ నెల 16న ఇంటికి తాళం వేసి శ్రీశైలం వెళ్లారు. దైవ దర్శనం అనంతరం 18వ తేదీ రాత్రి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇంటి తలుపులు బద్ధలుగొట్టి ఉండడం గమనించి లోపలకు వెల్లి పరిశీలించారు. గదిలో ఉన్న బీరువాను ధ్వంసం చేసి రూ. 3 లక్షల నగదు, 24.5 తులాల బంగారు నగలు, 260 గ్రాముల వెండి సామగ్రిని అపహరించినట్లు నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఉదయం కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ గోపి పరిశీలించారు. స్నిప్పర్ డాగ్‌ను రంగంలో దించారు. క్లూస్‌టీం సాయంతో నిందితుల వేలి ముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
రాయదుర్గం టౌన్: స్థానిక నేతాజీ రోడ్డులోని తాజ్‌జిన్నా ప్రాంతానికి చెందిన అబ్దుల్లా (42) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య ముంతాజ్, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గార్మెంట్స్ పరిశ్రమలో జీన్స్ కటింగ్ మాస్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు లోనయ్యాడు. పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలను పిలుచుకుని ముంతాజ్ గుండ్లపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న అబ్దుల్లా ఉరి వేసుకున్నాడు. గమనించి చుట్టుపక్కల వారు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అబ్దుల్లా మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment