అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయ ణ స్వామిని ప్రత్యేకంగా దర్శించుకుని.. ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకోవాలంటే ఇప్పుడు ఎలాంటి హైరానా పడాల్సిన అవస రం లేదు. రెండు వారాల ముందే పూజలకు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇలా భక్తులకు మరింత చేరువయ్యేందుకు రాష్ట్ర దేవదాయ శాఖ ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్ ప్రారంభించింది.
సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకునేలా ఆన్‌లైన్ సేవల ను సరళతరం చేసింది. 15–30 రోజుల ముందే ప్రముఖ ఆలయాల్లో గదులు, దర్శనాలు, వివిధ రకాల ఆర్జిత సేవల టికెట్లను బుకింగ్ చేసుకునేలా వ్యవస్థను సిద్ధం చేసింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ప్రసిద్ధ ఆలయాల్లో సాంకేతిక సేవలు అద్భుతంగా పనిచేస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్న మరిన్ని ప్రసిద్ధ ఆలయాలకు ఇదే విధానం అమలు చేసేలా దేవదాయ శాఖ నిర్ణయించింది.
వెబ్‌పోర్టల్ సిద్ధం..
రాష్ట్రంలోని అన్నవరం, సింహాచలం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, మహానంది, విశాఖపట్నం కనకమహాలక్ష్మి, అంతర్వేది, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి, కసాపురం నెక్కింటి ఆంజనేయస్వామి తదితర దేవస్థానాలతో పాటు అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయా ల్లో ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్ సేవలు భక్తులకు అందనున్నాయి.
ఈ మేరకు aptemples.ap.gov.in వెబ్‌పోర్టల్ ను సిద్ధం చేసింది. ఈ పోర్టల్ ఓపెన్ చేయగానే ఈ పైన పేర్కొన్న ఆలయాల చిత్రాలు కనిపిస్తాయి. మనకు ఏ ఆలయానికి చెంది న సమాచారం కావాలంటే..ఆ ఆలయ పోర్టల్ వద్ద క్లిక్ చేస్తే...గదులు, దర్శనాల టికెట్లు, ఆర్జిత సేవల టికెట్ల వివరాలు కనిపిస్తాయి. మనకు కావాల్సిన టికెట్లపై క్లిక్ చేసి పేమెంట్ మోడ్‌లో పే చేస్తే.. అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది. వెంటనే సెల్‌ఫోన్‌కు మెసేజి రూపంలో సమాచారం అందుతుంది.
అరసవల్లి ఆన్‌లైన్ సేవలివే..
వెబ్‌సైట్: ఏపీటెంపుల్స్.ఎపి.జివోవి.ఇన్
వసతి గదులు: 07 (ఒక్కో గది రూ.300)
ఆదిత్యుని విశిష్ట దర్శనం : రూ.500
(ఆదివారం మాత్రమే)
ప్రత్యేక దర్శనం : రూ.100
(ఆదివారం మాత్రమే)
ఆదిత్యుని క్షీరాభిషేకం: రూ.500
(మాస సంక్రమణం తేదీల్లో)
కల్యాణ సేవ : రూ.500 (శుద్ద ఏకాదశి,
బహుళ ఏకాదశి తేదిల్లో)
సూర్యనమస్కారాల పూజలు : రూ.300
(ప్రతిరోజూ), రూ.100 (ప్రతి ఆదివారం)
అష్టోత్తర శత నామార్చన: రూ.50 (పరోక్ష సేవ)
సహస్ర నామార్చన : రూ.100 (పరోక్ష సేవ)
మరింత సౌకర్యవంతంగా..
దేవదాయ శాఖ నిర్వహణలో ఉన్న ఈ పోర్టల్ ద్వారా అరసవల్లి ఆలయంలో నిర్వహిస్తున్న సేవల టికెట్లను ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌గా పొందవచ్చు. ఆన్‌లైన్లో సేవలందించే ప్రధాన ఆలయాల్లో అరసవల్లిని చేర్చడంతో ఆరోగ్యం కోసం ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్న సుదూర ప్రాంత భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ పోర్టల్‌లో మరిన్ని సేవలను పొందుపరిచేలా చర్యలు చేపడుతున్నాం.
– వి.హరిసూర్యప్రకాష్, ఆదిత్యాలయ ఈఓ, అరసవల్లి
Comments
Please login to add a commentAdd a comment