బూడిదే మిగిలింది!
● అంబటి ఎరుకువానిపేటలో వరి చేను దగ్ధం
● గత ఏడాది కూడా కాలిపోయిన కుప్పలు
● అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత రైతు
గార: ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట కాలిబూడిద కావడంతో బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. గత ఏడాది కూడా ఇదే తరహాలో వరి పంట దగ్ధం కావడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గార మండలం అంపోలు పంచాయతీ అంబటి ఎరుకువానిపేట సమీపంలో వరి చేను దగ్ధమైంది. గ్రామానికి అంబటి రామదాసు, వాణిలకు చెందిన పొలంలో అల్లుడు బాన్న రమణ వరి సాగు చేశాడు. సోమవారం సాయంత్రం చేను నూర్పు చేసేందుకు పొలం నుంచి తీసుకొచ్చి స్థానిక రియల్ ఎస్టేట్ స్థలంలో ఉంచి మంగళవారం ఉదయం నూర్పు చేసేందుకు సిద్ధమయ్యాడు. రాత్రి చాలా సమయం అక్కడే ఉన్న రైతు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి మంటల్లో ఉన్న వరిచేను గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చాడు. శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ. 70 వేలు నష్టం వాటిల్లినట్టు బాధిత రైతు చెబుతున్నాడు. గతంలో కూడా పంటపొలంలోనే వరికుప్పలు కాలిపోవడం, ఈ ఏడాది కూడా నూర్పుకి సిద్ధమైన చేను కాలిపోవడంతో అనుమానం వచ్చి బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ రెల్ల జనార్దనరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కొత్తూరు: మండలంలోని బలద గ్రామానికి చెందిన బొడ్డేపల్లి రమేష్ జగన్నాథపేట సమీపంలో వరిపంట సాగు చేశాడు. కష్టపడి పండించిన 30 బస్తాల ధాన్యం మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. విషయం తెలుసుకున్న వీఆర్వో రాజగోపాలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ధాన్యానికి నిప్పు పెట్టి ఉంటారని బాధిత రైతు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment