అన్నీ అక్రమాలేనండి!
ప్రొటోకాల్
బండి..
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడికి జిల్లా యంత్రాంగం కేటాయించిన ప్రొటోకాల్ వాహనమిది. ఏపీ 39ఎక్స్ 6తో పాటు ఏపీ 30ఏజీ 0369వాహనం కూడా కేంద్రమంత్రికి కేటాయించారు. బాలాజీ ట్రావెల్స్‌కు చెందిన ఈ వాహనాలు ఎంత దూరం ప్రయాణించిందీ ఓ లాగ్‌బుక్‌లో నమోదు చేస్తారు. దాని ప్రకారం అద్దె చెల్లిస్తారు. వాహనం తిరిగితే డీజిల్ వినియోగంతో కూడిన బిల్లు చెల్లించాలి. తిరగకుండా మంత్రి దగ్గరే ఉంటే అద్దె మాత్రమే చెల్లించాలి. ఇదే బండి జాతీయ సఫాయి కార్మికుల కమిషన్ సభ్యులు పి.పి.వావా అనే అధికారికి కేటాయించడం కలకలం రేపుతోంది.
● కేంద్రమంత్రికి కేటాయించిన వాహనాన్ని వేరొకరికి అద్దెకిచ్చిన బాలాజీ ట్రావెల్స్
● రెండు విధాలుగా బిల్లు చేసుకునే అవకాశం ఉందని ఆరోపణలు
● గతంలోనూ అద్దె వాహనాల అవకతవకలు
● అక్రమాలు జరిగాయని గుర్తించిన
అప్పటి కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్
● సుమారు రూ. 65లక్షల వరకు బిల్లులు నిలిపివేత
● తాజా పరిణామంపై కలెక్టర్, జేసీకి ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ప్రొటోకాల్ బండితో రెండు బిల్లులు కాజేసే అక్రమం బట్టబయలైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రికి కేటాయించిన ఏపీ 39ఎక్స్ 6 వాహనాన్ని సోమవారం, మంగళవారం జాతీయ సఫాయి కార్మికుల కమిషన్ సభ్యులు పి.పి.వావా అనే అధికారికి పెట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బాలాజీ ట్రావెల్స్ నుంచే ఈ వాహనాన్ని అద్దెకు తీసుకుని పెట్టారు. అంటే ఒకే వాహనాన్ని అటు కేంద్రమంత్రికి, ఇటు జాతీయ సఫాయి కార్మికుల మిషన్ సభ్యులకు కేటాయించారు. అది కూడా ఒకే రోజులో. దీని ద్వారా రెండు సార్లు బిల్లు చేసుకునే అవకాశం ఉంటుంది. నిబంధనల ప్రకారం ఇది అక్రమమే. ప్రొటోకాల్ ప్రకారం వాహనం కేటాయించాక అది ఖాళీగా ఉన్నా సరే అధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చాకే మరొకరికి కేటాయించాలి. కేంద్రమంత్రి రక్షణ దృష్ట్యా ఆ వాహనాన్ని ఒకరికే పరిమితం చేయాలి. ఒకసారి బయటికి వెళ్తే సెక్యూరిటీ పరమైన లోపాలు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఎప్పటి నుంచో ఆరోపణలు..
ప్రొటోకాల్ వాహనాలను చాలా ఏళ్ల నుంచి బాలాజీ ట్రావెల్స్‌కు సంబంధించినవే పెడుతున్నారు. వీటి వినియోగంపై ఆరోపణలు ఉన్నాయి. వాహనాలు తిరగకపోయినా డీజిల్‌తో పాటు అద్దె బిల్లు పెడుతున్నారనే వాదనలు ఉన్నాయి. కేంద్రమంత్రులకై తే రెండు, జిల్లా మంత్రులకైతే ఒక ప్రొటోకాల్ వాహనం పెడుతున్నారు. ఇవి కాకుండా వీఐపీల పర్యటనలో అదనంగా బాలాజీ ట్రావెల్స్‌తో పాటు మరికొన్ని ట్రావెల్స్ నుంచి అద్దెకు వాహనాలు పెడుతున్నారు. ముఖ్యంగా ప్రొటోకాల్ కింద పెట్టిన వాహనాల వినియోగంలో అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో బాలాజీ ట్రావెల్స్ బిల్లుల విషయంలో వివాదం చోటు చేసుకుంది. అప్పట్లో కలెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీ లాఠ్కర్ పనిచేసినప్పుడు బిల్లుల్లో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో సుమారు రూ.65లక్షల బిల్లులు బాలాజీ ట్రావెల్స్‌కు చెల్లించకుండా ఆపేశారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. కానీ చెల్లింపులు జరగలేదు. మూడు బృందాలతో అప్పట్లో బిల్లులు విచారణ జరిపించినట్టు సమాచారం. డబుల్ ఎంట్రీ, జీఓలో లేని విధంగా, ఇష్టారీతిన బిల్లులు రాసేశారని గుర్తించినట్టు సమాచారం. ఈ బిల్లులు చెల్లించాలని శ్రీకేష్ బి.లాఠకర్ తర్వాత వచ్చిన ప్రతి కలెక్టర్‌ను ఒత్తిడి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ప్రస్తుత కలెక్టర్‌పై కూడా బిల్లులు చెల్లించాలని ఓ రాజకీయ ప్రముఖుడితో ఒత్తిడి చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాట్సాప్ ద్వారా ఫిర్యాదు
కేంద్ర మంత్రికి కేటాయించిన ఏపీ39ఎక్స్ 6 నంబర్ గల వాహనాన్ని మున్సిపల్ కార్పొరేషన్‌కు అద్దెకిచ్చినట్టు, దానికి సంబంధించిన ఫొటోలతో సహా ప్రస్తుత కలెక్టర్‌కు వాట్సాప్ ద్వారా ఒకరు ఫిర్యాదు చేశారు. దానిపై కలెక్టర్ కూడా ‘ఓకే’ అని స్పందించారు. అలాగే, జాయింట్ కలెక్టర్‌కు కూడా వాట్సాప్‌లోనే ఫొటోలతో సహా ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని స్పందించారు. ఈ పరిణామంపై కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం.చక్రవర్తిని వివరణ కోరగా నెలకు సంబంధించి లాగ్‌బుక్ సమర్పించిన తర్వాత మాత్రమే ఏం జరిగిందో గుర్తించగలమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment