![కవిటి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/18/17cto32-280019_mr-1734463062-0.jpg.webp?itok=SzLBDeDK)
కవిటి హెచ్‌ఎం, ముగ్గురు టీచర్లకు షోకాజ్ నోటీసులు
శ్రీకాకుళం న్యూకాలనీ,కవిటి: జిల్లాలోని కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మల్లేశ్వరరావుతోపాటు అదే మండలంలోని కవిటి జెడ్పీహెచ్‌స్కూల్ (ఒరియా) ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లు (ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్)కు డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య షోకాజ్‌లు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లిప్తత, పర్యవేక్షణ లోపం, పాఠశాల అసెంబ్లీ, 100 రోజుల ప్రణాళిక అమలుకాకపోవడం, పాఠశాలలో విద్యాసంబంధిత ఇతర కార్యక్రమాల అమలు చేయకపోవడం తదితర కారణాలతో కవిటి జీహెచ్‌స్కూల్ హెచ్‌ఎం బెందాళం మల్లేశ్వరరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే అదే మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కవిటిలో సమయపాలన పాటించక, విధి నిర్వహణలో ఉదాశీనత కారణంగా ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లు/పీజీటీ/జేఎల్‌లు కింగర ప్రేమలత (ఫిజికల్ సైన్స్), లిమ్మ సూరజ్ సుందర్ (మాథమేటిక్స్), ఎర్ర బాలరాజు (ఇంగ్లీషు)లకు జిల్లా విద్యాశాఖాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హెచ్‌ఎంకు 2 రోజుల్లో, స్కూల్ అసిస్టెంట్ల నుంచి 3 రోజుల్లోగా లిఖితపూర్వకమైన వివరణ కోరారు. వారి వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీఈఓ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సఫాయి కర్మచారుల
సంక్షేమంపై దృష్టి
శ్రీకాకుళం పాతబస్టాండ్: సఫాయి కర్మచారుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను సక్రమంగా అమలు చేయా లని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యు లు పీపీ వావా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, సఫాయి కార్మికులు, ఆయా సంఘాల ప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సఫాయి కర్మచారులు అందించే సేవలు అమూల్యమైనవని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరికి కనీస వేతనాలు దక్కేలా చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో కర్మచారులను నియమించి వారికి ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన జిల్లాలో సఫాయి కర్మచారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి వచ్చిన సఫాయి కర్మచారుల సంఘం ప్రతినిధులు తమకు రుణాలు, ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ సఫాయి కర్మచారుల విజ్ఞప్తులపై యంత్రాంగం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నేటి నుంచి పాలిటెక్నిక్ క్రీడాపోటీలు
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు అంతర పాలిటెక్నిక్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ బి.జానకిరామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో
హత్య కేసు నిందితుడు
ఆమదాలవలస: మండలంలోని గాజులకొల్లివలస సమీపంలో ఆర్‌ఎండ్‌ఆర్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దామోదర పద్మ(35)ను హత్య చేసి పరారైన అదే గ్రామానికి చెందిన సొండి సురేష్‌ను ఆమదాలవలస పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కాలనీలోని అమ్మవారి ఆలయం సమీపంలో ఓ ఇంటిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో సుమారు 30 మంది సిబ్బంది వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కె.వెంకటేష్ వద్ద ప్రస్తావించగా నిందితుడు తమ అదుపులోనే ఉన్నాడని, ఇంకా అరెస్ట్ చేయలేదని, విచారణ చేస్తున్నామని చెప్పారు.
![కవిటి హెచ్‌ఎం, ముగ్గురు టీచర్లకు షోకాజ్ నోటీసులు 1](https://www.sakshi.com/gallery_images/2024/12/18/sprots_mr-1734463062-1.jpg)
కవిటి హెచ్‌ఎం, ముగ్గురు టీచర్లకు షోకాజ్ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment