ముగిసిన ఆవిష్కార్ హేకతాన్
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఆవిష్కార్ హేకతాన్ జాతీయ స్థాయి సాంకేతిక కార్యక్రమం సోమవారంతో ముగిసింది. సుమారు 19 రాష్ట్రాల నుంచి 51 ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 186 మంది విద్యార్థులు హాజరై సాంకేతిక ప్రతిభను చాటుకున్నారు. దీనిలో శ్రీఈశ్వర్ కళాశాల కోయంబత్తూరు విద్యార్థులు రూపకల్పన చేసిన ఆక్వానీటి యంత్రం ద్వారా నీటిని సేకరించడం ఆలోచనకు మొదటి బహుమతిగా రూ.1.25 లక్షలు అందుకున్నారు. విజయనగరం మహారాజా కళాశాల విద్యార్థులు రూపకల్పన చేసిన రిజర్వేషన్ టికెట్ల రీసైక్లింగ్ ఆలోచనకు రెండో బహుమతిగా రూ.1 లక్ష కై వసం చేసుకున్నారు. ముంబైకు చెందిన ఏసీ పఠేల్ కళాశాల విద్యార్థులు రూపకల్పన చేసిన ఏఐ ఉపయోగించి బోధన, పరీక్ష విధానంలో మార్పులు అనే ఆలోచనకు మూడో బహుమతిగా రూ.75 వేలు అందుకున్నారు. వీరితో పాటు ఐతమ్, ఎస్‌వీఎన్‌ఐటీ సూరత్ కళాశాల విద్యార్థులు కన్సోలేషన్ బహుమతులు సాధించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, స్టార్టప్ మెంటార్ మనోజ్‌కుమార్ బడగర్‌వాలా, డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు చేతుల మీదుగా విజేతలకు నగదు ప్రోత్సాహకాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు సందీప్ బత్తుల, సుస్మా బడగర్‌వాలా, డీన్లు జి.సతీష్‌కుమార్, ఎం.వి.ఎస్.కుమార్, జె.సురేష్‌కుమార్, గిరీష్‌కుమార్, సాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment