ల్యాబ్‌టెక్నీషియన్, ఎఫ్‌ఎన్‌ఓ పోస్టుల భర్తీ
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో ఉన్న పలు పీహెచ్‌సీల్లో ల్యాబ్ టెక్నీషియన్–1 (కాంట్రాక్టు), ఎఫ్‌ఎన్‌ఓ–05 (ఔట్ సోర్సింగ్) పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా డీఎంహెచ్‌ఓ బాలమురళీకృష్ణ తెలియజేశారు. ఈ మేరకు ఆసక్తి గత అభ్యర్థులు ఈనెల 22 లోగా డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి సమర్పించాలని ఆయన కోరారు.
వైద్యాఽధికారుల పోస్టుల భర్తీ
జిల్లాలో వైద్యారోగ్య శాఖ పరిధిలోని ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, జిల్లా జనరల్ ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేసేందుకు గాను మొత్తం ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నట్టు డీఎంహెచ్‌ఓ బాలమురళీకృష్ణ ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు ఫిజీషియన్ 01, మెడికల్ ఆఫీసర్ 02, క్లినికల్ సైకాలజిస్టు 01, ఆఫ్తమాలజిస్టు 01, డెంటల్ టెక్నీషియన్ 01 తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు, ఆసక్తి గల అభ్య ర్థులు ఈనెల 22 లోగా తమ దరఖాస్తులను డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి పంపించాలని, మరిన్ని వివరాలకు శ్రీకాకుళం.ఎపి.జివోవి.ఇన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన తెలియజేశారు.
విజయదుర్గమ్మకు ప్రత్యేక అలంకరణ
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళంలోని నానుబాలవీధిలో వేంచేసిన విజయదుర్గా దేవి ఆలయంలో పుష్యమాస శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆమదాలవలసలో
సినీ నటుల సందడి
ఆమదాలవలస: ఆమదాలవలస మండలం కొర్లకోటలో సినీనటులు సందడి చేశారు. గ్రామానికి చెందిన పేడాడ నర్సింగరావు, రమణికుమారిల కుమారులు దీపక్‌సరోజ్, సందీప్ సరోజ్‌లు సినీ నటులుగా చిన్ననాటి నుంచి రాణిస్తున్నారు. దీపక్ సరోజ్ అతడు, పోకిరి, లెజెండ్, ఆర్య, పౌర్ణమిలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశా రు. రోటి కాపడా రొమాన్స్, కమిటీ కుర్రోళ్లు, మిణుగురులు సినిమాల్లో సందీప్ సరోజ్ హీరో క్యారెక్టర్‌తోపాటు సైడ్ హీరోగా క్యారెక్టర్‌లు చేశారు. ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్నా వీరిద్దరు పండగకు సొంత గ్రామానికి వచ్చారు. అలాగే ఆమదాలవలస మండలం శ్రీహరిపురం గ్రామంలో గల వారి బంధువులు రాజశేఖర్ కుటుంబ సభ్యులతో శుక్రవారం కలిసి గడిపారు.
వదంతులు నమ్మవద్దు
పోలాకి: పోలాకి తీర ప్రాంత గ్రామాల్లో పులి సంచరిస్తోందన్న వదంతులను నమ్మవద్దని అటవీ శాఖ సెక్షన్ అధికారి శ్రీనివాసరావు అన్నారు. డీఎల్‌పురం సెక్షన్ పరిధిలో పులి లేదా అలాంటి ఆకారంలో గల ఎలాంటి జీవి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లేవని తేల్చిచెప్పారు. గురువారం రాత్రి కొత్తరేవు, కొవిరిపే ట గ్రామాల మధ్యలో జీడిమామిడి తోటల్లో పులి కనిపించినట్లు సామాజిక మాధ్యమాల్లో షేర్‌చేస్తున్న ఫొటోలు, వీడియోలు సైతం ఫేక్ అని తెలిపారు. తీరప్రాంత గ్రామాల్లో శుక్రవారం ప్రజలకు అవగాహన కల్పించామని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఆలస్యంగా నడిచిన రైళ్లు
కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ మీదుగా శుక్రవారం పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. విశాఖ నుంచి భువనేశ్వర్ వైపు వెళ్లే ప్రశాంతి, రాజారాణి, ఇంటర్‌సిటీ, విశాఖ–బ్రహ్మాపూర్, భువనేశ్వర్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు సుమారు అర్ధగంట ఆలస్యంగా నడిచాయి. వందేభారత్ కూడా స్టేషన్‌లో ఆగి ఆలస్యంగా బయల్దేరింది.
Comments
Please login to add a commentAdd a comment