ఆదిత్యుని సన్నిధిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బృందం
అరసవల్లి,జలుమూరు: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యా యమూర్తులు జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ జె.శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ ఈఓ వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు వేదమంత్రోచ్ఛరణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయ దర్శనం చేయించి ఆలయ విశిష్టతను శంకరశర్మ వారికి వివరించారు. వీరికి ఆలయం తరఫున ఆదిత్యు ని జ్ఞాపికను ఆలయ ఈఓ వై. భద్రాజీ అందజేశారు. వీరి వెంట జిల్లా అడిషినల్ సబ్ జడ్జి యుగంధర్, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సన్యాసి నాయుడు, డీఎస్పీ వివేకానంద తదితరులున్నారు. శ్రీముఖలింగం క్షేత్రాన్ని కూడా వీరు దర్శించుకున్నారు.
పండగ పూట అమ్మకో చీర పెట్టడం బిడ్డకు ఎనలేని సంతోషం. నాన్నకు ఓ జత బట్టలు కొనివ్వడం ఎంతో సంతృప్తి. అమ్మకు చీర పెట్టినంత సంబరంగా కొందరు సొంతూరికి సేవ చేస్తున్నారు. తండ్రిని గౌరవించినంత ఆనందంగా సొంత బడిని బాగు చేసుకుంటున్నారు. చదువు నేర్పిన విద్యాలయం రుణం తీర్చుకుంటున్నారు. నడత నేర్పిన ఊరిదారులను మర్చిపోకుండా తమ వంతు సాయం అందిస్తున్నారు.
వజ్రపుకొత్తూరు రూరల్:
ఉద్దాన ప్రాంతం మోట్టూరు పంచాయతీ పరిఽధిలో గల వంకులూరు గ్రామానికి చెందిన గుంటు వేణుగోపాలరావు 4 దశాబ్దాల కిందట గ్రామాన్ని విడిచిపెట్టి గుజరాత్‌లో కుటుంబంతో స్థిరపడ్డారు. ఊరికి దూరంగా ఉన్నా.. ఆయన ఆలోచనలు మాత్రం ఇక్కడే తిరుగుతున్నాయి. ఊరికి ఎలాగైనా ఉపకారం చేయాలని తలచి తన సొంత డబ్బుతో సామాజిక భవనాలు, ఆలయాలు నిర్మించారు. గ్రామంలో సోలార్ దీపాలు ఏర్పాటు చేసి వెలుగులు నింపుతున్నారు. విపత్తుల సమయంలో ప్రజల అవసరాలను తీర్చుతున్నారు.
ఊరికి ఊతం..
● తన తల్లిదండ్రులు గుంటు జగన్నాథం కళావతమ్మ జ్జాపకార్థంగా గ్రామంలో రూ.38 లక్షల వ్యయంతో సామాజిక భవనం నిర్మించారు.
● రూ.1.25 లక్షల వ్యయంతో సోలార్ లైట్లు వేశారు.
● పోలీస్‌స్టేషన్ అభివృద్ధికి రూ.50వేలు సాయం చేశారు.
● ఏటా 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ. 50 వేలు అందజేస్తున్నారు.
● సామాజిక భవనంలో ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
● సీసీ రోడ్డు నిర్మాణం కోసం కొంత స్థలం వితరణగా అందించారు.
● కరోనా విపత్కర పరిస్థితిలో నిత్యావసర సరుకులతో పాటు మందులను అందజేశారు.
ఊరే నా కుటుంబం
దేవుడి దయ, నా శ్రమతో పారిశ్రామిక వేత్తగా ఎదిగి గుజరాత్‌లో స్థిరపడ్డాను. కానీ నా ఆలోచనలు మాత్రం పుట్టిన ప్రాంతంపైనే ఉన్నాయి. పుట్టిన ఊరికి ఎంత చేసినా రుణపడి ఉంటాం. అందుకే గ్రామ అభివృద్ధికి నేను సంపాదించిన మొత్తంలో కొంత సాయం అందిస్తున్నాను.
– గుంటు వేణుగోపాల్‌రావు, పారిశ్రామిక వేత్త,
వంకులూరు,వజ్రపుకొత్తూరు
Comments
Please login to add a commentAdd a comment