వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్త దాడి
సంతబొమ్మాళి: మండలంలోని దండుగోపాలపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీను చించేయడమే కాకుండా వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటి పైకి కత్తులు, కర్రలతో వెళ్లి దాడికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం..దండుగోపాలపురంలో ఏర్పాటు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీని బుధవారం అదే గ్రామానికి చెందిన అనపాన అభిలాష్, కూనపు ఉపేంద్ర తదితర టీడీపీ కార్యకర్తలు చింపివేశారు. అంతటితో ఆగకుండా అభిలాష్ నేరుగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త సిర్లాపు నరేష్ ఇంటికి వెళ్లి చేతితో కొట్టాడు. దుర్భాషలాడుతూ కత్తి, చెక్కతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో నరేష్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై తలుపులు వేసుకున్నారు. అనంతరం బాధిత వైఎస్సార్‌సీపీ కార్యకర్త నరేష్‌తో పాటు మండల నాయకులు బసవల బాలరాజు, కోత సతీష్, మార్పు నాగభూషణ్, పొందల రామకృష్ణ, పొందల నరేంద్ర, తదితరులు కలిసి సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అభిలాష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీను చించిన అభిలాష్, కూనపు ఉపేంద్ర తదితరులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్త బసవల బాలరాజు మరో ఫిర్యాదు చేశారు.
దాడిని ఖండించిన తిలక్, దువ్వాడ
విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ బాధిత కార్యకర్తలతో మాట్లాడారు. దాడిని తీవ్రంగా ఖండించారు. కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనపై కేసు నమోదు చేసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో జాప్యం జరిగితే సహించేది లేదన్నారు. దాడి కేసులో నిందితుడిపై చర్యలు తీసుకుకోవాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీ సైతం ధ్వంసం
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
Comments
Please login to add a commentAdd a comment