ఆలోచన మారింది.. ఆదాయం పెరిగింది!
● బంతి పూల సాగుతో
అదనపు ఆదాయం
● బీడు నేలలో బంతిపూల వికాసం
ఎల్.ఎన్.పేట: ఖరీఫ్ వరిచేను కోత కోసిన తర్వాత రైతులు ఏదో ఒక పంటను సాగు చేస్తారు. ఎక్కువగా అపరాలు, మొక్క జొన్న, నువ్వు, వేసవి వరి వంటి పంటలు పండిస్తారు. అదే పంట ఏటా పండించటం, దళారులు అడిగిన ధరకు అమ్ముకోవటం వల్ల పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. మూడు, నాలుగు నెలల తర్వాత ఎప్పుడో పంట చేతికి అందివచ్చినప్పుడు అమ్ముకునే కంటే మార్కెట్‌లో నిత్యం గిరాకీ ఉన్న పంటలను పండిస్తే నచ్చి న ధరకు అమ్ముకోవచ్చని భావించారు. పంట దిగుబడులను ప్రతి రోజూ అమ్ముకుంటూ రోజూ ఆదా యం పొందాలని భావించారు. ఆలోచన మారడంతో వారికి అదనపు ఆదాయం పెరిగింది. మండలంలోని తురకపేట, పూశాం, చొర్లంగి, లక్ష్మీనర్సుపేట గ్రామాలకు చెందిన కొందరు రైతులు బంతి పువ్వు లు, కూరగాయల పంటలను పండిస్తూ ఆదాయం పొందుతున్నారు.
మార్కెట్ సదుపాయం లేక
పువ్వులు, కూరగాయలు పండించిన రైతులకు మార్కెట్ సదుపాయం లేక పంట దిగుబడులు అమ్మేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పంట కొనేందుకు వ్యాపారులు రైతుల వద్దకు రావటం లేదు. దీంతో రైతులే పంట తీసుకుని వ్యాపారుల వద్దకు అమ్మేందుకు వెళుతున్నారు. ధర బాగా ఉన్నప్పటికీ తీసుకుని వెళ్లేందుకు రవాణా పరంగా రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మార్కెట్ సదుపాయం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
రోజూ దిగుబడి.. ఆదాయం
పూలు, కూరగాయలు వారంలో మూడు, నాలుగు సార్లు కోతకు వస్తున్నాయి. వీటిని అమ్మటంతో వారంలో నాలుగు సార్లు రైతన్న చేతికి ఆదాయం అందుతుంది. ఒకసారి కోతకు వచ్చిన తర్వాత నీటి తడులు పెట్టి అవసరం మేరకు ఎరువులు వేసుకుంటే సుమారు మూడు నెలల వరకు పంట చేతికి అందుతూనే ఉంటుందని రైతులు చెబుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది.
బంతిపూల సాగుతో ఆదాయం
మండలంలోని పూశాం, చొర్లంగి గ్రామాలకు చెందిన శివ్వాల సుదర్శనరావు ఎకరా పొలంలో ఈ ఏడాది ఎరుపు, పసుపు రంగుల బంతి మొక్కలు వేశారు. బంతి పూలకు మార్కెట్‌లో ఈ ఏడాది ధర తగ్గినప్పటికీ తన పెట్టుబడికి తగిన ఆదాయం వచ్చింది. బెంగళూరు నుంచి విత్తనం తెప్పించి సీతంపేటలో నారు సిద్ధం చేయించాం. బంతి పూలు కిలో రూ.100ల వరకు విక్రయించాం. పువ్వులు అమ్ముకునేందుకు ఈ ప్రాంతంలో సరైన మార్కెట్ సదుపాయం లేక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. – శివ్వాల సుదర్శనరావు,
రైతు, పూశాం, ఎల్‌ఎన్ పేట
రకరకాల కూరగాయల సాగు
పొలాన్ని మెత్తగా దుక్కి చేసిన తర్వాత బాగా కుళ్లిన గత్తం వేసి మరోసారి నీటి తడిపెట్టి పొలాన్ని మెత్తగా దుక్కి చేసి కూరగాయల విత్తనాలు వేసేందుకు అనువుగా చిన్నచిన్న బోదుల్లా (గట్టుల్లా) వేసుకుని నీటి తడి పెట్టిన తరువాత పొలంలో బెండ విత్తనాలు వేసుకున్నాం. ఎరువులు, పురుగుల మందులు తక్కువగా వినియోగిస్తూ పంట పండిస్తున్నాం. ప్రస్తుతం వారంలో మూడు సార్లు బెండ కోతకు వస్తుంది. బీర, మరోవైపు పొడవు చిక్కుడు, గట్టుల చుట్టూ ఆనప వేశాం. మరికొన్ని రోజులు ఆగితే మిగిలిన పంటలు కోతకు వస్తాయి.
– పైడి దాసు, రైతు, తురకపేట, ఎల్.ఎన్.పేట
Comments
Please login to add a commentAdd a comment