వీజీకే మూర్తికి ఘనంగా నివాళి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సీఐటీయూ శ్రీకాకుళం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు వీజీకే మూర్తి మృతి కార్మిక, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి తెలిపారు. శ్రీకాకుళంలో గురువారం గుండెపోటుతో చనిపోయిన వీజీకే మూర్తి పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. ఆయన ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తూ వచ్చిన వేతనంలో చాలా వరకు ప్రజా ఉద్యమాలకు ఖర్చు చేశారని తెలిపారు. 1997లో పైడిభీమవరం పారిశ్రామిక ప్రాంతంలో శ్యాంక్రగ్ పిస్టన్స్–రింగ్స్ లిమిటెడ్ పరిశ్రమలో సీఐటీయూ అనుబంధ యూనియన్ ఏర్పాటు చేయడానికి, తర్వాత 8 నెలలు పాటు కార్మికులతో సుదీర్ఘ సమ్మె నడిపించడంలో మూర్తి కృషి ఎనలేనిదన్నారు. 1998లో అప్పటి కలెక్టర్ ఎస్‌ఈ శేఖరబాబుకు కార్మికులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను వివరించి పరిష్కారానికి చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన కుమార్తె, కుమారుడికి ఆదర్శ వివాహం చేశారని తెలిపారు. ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. వీజీకే మూర్తి సంతాప సభ శుక్రవారం ఉదయం 8 గంటలు నుంచి శ్రీకాకుళంలో కత్తెర వీధిలో గల ఆయన ఇంటి వద్ద నిర్వహించనున్నట్లు తెలిపారు.
రిమ్స్‌కు శరీరదానం..
ఉదయం 9.30 గంటలకు ఆయన ఇంటి నుంచి రిమ్స్ వరకు ప్రదర్శన నిర్వహించి ఆయన పార్థివ దేహాన్ని రిమ్స్‌కు దానం చేయనున్నట్లు తెలిపారు. యూనియన్ నాయకులు, ఉద్యోగులు, కార్మికులు, స్కీమ్ వర్కర్స్ అంతిమయాత్రలో పాల్గొనాలని కోరారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, అల్లు సత్యనారాయణ తదితరులు నివాళులర్పించారు. గురువారమే రెడ్‌క్రాస్ సాయంతో ఆయన నేత్రాలను విశాఖలోని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment