వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ దువ్వారివీధికి చెందిన 3వ వార్డు మెంబర్ వైఎస్సార్‌సీపీ కార్యకర్త, విలేకరిగా పనిచేస్తున్న పెద్దింటి తిరుపతిరావుపై సోమవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో గుర్తుతెలియ ని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో పెద్దింటి తిరుపతిరావు ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోకి చొరబడి తిరుపతిరావు మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో తిరుపతిరావు మెడ, రెండు చేతులపై తీవ్రగాయాలయ్యాయి. తిరుపతిరావు కుటుంబ సభ్యులతో ప్రతి సోమవారం తెల్లవారు జామున మహేంద్రతనయ నది పక్కన ఉన్న నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి వెళతాడని తెలుసుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఆ సమయంలోనే దాడి ప్రయత్నించాడు. దాడి చేసినప్పుడు ఆ వ్యక్తి మంకీ టోపి, లుంగీ ధరించి ఉన్నాడని, ఇంటి మేడపై నుంచి ఇంటి వెనుక నుంచి నాగువంశంవీధి వైపు వెళ్లినట్లు పోలీసులకు తిరుపతిరావు తెలిపారు. దాడి జరిగిన వెంటనే తిరుపతిరావును కుటుంబసభ్యులు స్థానిక సీహెచ్‌సీకు తీసుకు వెళ్లి చికిత్స అందించారు. సంఘటన జరిగిన వెంటనే పాతపట్నం సీఐ వి.రామారావు సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సీహెచ్‌సీకి వెళ్లి తిరుపతిరావుతో సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెక్కలి నుంచి వచ్చిన క్లూస్ టీమ్‌తో సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దువ్వారివీధి, నాగవంశంపు వీధి, మెయిన్ రోడ్డులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను క్లూస్ టీం, పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేవని, రాజకీయ పరంగా శత్రువులు ఇలా చేసి ఉండవచ్చని బాధితుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment