పంచాయతీ ఉద్యోగి చేతివాటం పై ఫిర్యాదు
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి పంచాయతీకి చెందాల్సిన సొమ్మును సొంత అవసరాలకు వినియోగించుకున్న వైనంపై వార్డు సభ్యుడు దాడి ధర్మారావు సోమవారం జిల్లా కేంద్రంలో గల అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు అందజేశా రు. ఈ మేరకు ‘పంచాయతీ ఉద్యోగి చేతివాటం’ అనే కథనం సాక్షిలో ప్రచురితమైన సంగతి తెలిసిందే. అయితే టెక్కలి మేజర్ పంచాయతీ కార్యాలయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇంటి పన్నుల విషయంలో కొంత మంది సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ ఫిర్యా దులో పేర్కొన్నారు. కార్యాలయంలో చాలా ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది సిబ్బంది పూర్తిగా అక్రమ మార్గంలో డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంటర్ ప్రీ–ఫైనల్ పరీక్షలు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రీ ఫైనల్ పరీక్షల్లో భాగంగా తొలిరోజు సోమవారం తెలుగు, సంస్కృతం, హిందీ పేపర్లకు పరీక్షలు రాశారు. 2024 ఇంటర్ బోర్డు పబ్లిక్ ప్రశ్న పత్రాల్లో మిగిలిన ఒక సెట్ ప్రశ్న పత్రాలను ఈ ప్రీ–ఫైనల్ పరీక్షలకు వినియోగిస్తున్నారు. సంక్రాంతి సెలవులు ముగిసిన తొలిరోజే ప్రీ–ఫైనల్ పరీక్షలు జరగడంతో 20 నుంచి 40 శాతం మంది వరకు విద్యార్థులు గైర్హాజరైనట్లు గుర్తించారు. సెలవులు ముగిసిన తొలిరోజు పరీక్షలు మొదలయ్యేటట్టు షెడ్యూల్‌ను తయారు చేయడం ఎంతమాత్రం సరికాదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ తీరును ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సైతం తప్పుబడుతున్నారు.
యూపీఎల్‌సీ అభివృద్ధికి
పేటెంట్ హక్కులు
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన రసాయన శాస్త్ర అధ్యాపకుడు బి.సతీష్‌కుమార్ బల్క్ డ్రగ్ పదార్థాల్లో సోనీడిగిబ్ దాని సేంద్రియ మలినాలను లెక్కించడానికి అల్ట్రా పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమోటోగ్రఫీ సహాయక పద్ధతిపై చేసిన అభివృద్ధి ప్రక్రియకు ఇండియన్ పేటెంట్ హక్కులు పొందారు. ఈ మేరకు సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. అధ్యాపకులు సతీష్‌కుమార్ అభివృద్ధి పరచిన రసాయన పద్ధతులకు తగిన గుర్తింపు రావడంపై ఎంతో సంతోషంగా ఉందంటూ ప్రిన్సిపాల్‌తో పాటు ఇతర సిబ్బంది అభినందించారు.
పురాతన విగ్రహాలు లభ్యం
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని బుడుమూరు గ్రామంలో పురాతన విగ్రహాలు కనిపిస్తున్నాయని ఇంటాక్ బృందం కన్వీనర్ నూకా సన్యాసిరావు, అదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాఽథనాయుడు, చింతాడ కృష్ణమోహన్‌లు తెలిపారు. ఇక్కడ పురాతన విగ్రహాలు కనిపిస్తున్నట్లు వెంకటాపురం గ్రామానికి చెందిన నెల్లి దాలినాయుడు ఇచ్చిన సమాచారం మేరకు సో మవారం ఇంటాక్ బృంద సభ్యులు బుడు మూరు గ్రామానికి వెళ్లి ఇక్కడ విగ్రహాలను పరిశీలించారు. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు బుద్ధుడి కాలం కంటే ముందువని, మారీచి అమ్మవారి విగ్రహం గ్రామం మధ్యలో ఉండడం విశేషమని అన్నారు. ఈ విగ్రహాన్ని స్థానికులు వమ్మరవల్లి అమ్మవారని పేర్కొంటున్నారని తెలిపారు. ఏనుగు మీద అమ్మవారు ఉన్న విగ్రహం బుద్ధుని కాలం కంటే ముందుదని చరిత్ర చెబుతోందన్నారు. కళింగులు కాలంలో ఉన్న విగ్రహాలు కూడా కొన్ని చిన్నచిన్నవి కనిపించాయని తెలిపారు. ఇటీవల గ్రామస్తులు ఇక్కడ దుర్గాదేవి ఆలయాన్ని ని ర్మించారని, ఈ సందర్భంగా నాలుగైదు ప్రాచీ న విగ్రహాలు బయటపడగా అందులో బుద్ధుని విగ్రహం ఉండటం గమనించామని తెలిపారు. తాము గమనించిన మేరకు గతంలో ఈ ప్రాంతమంతా కళింగ గంగుల పాలనలో ఉన్నట్లుగాను, అలాగే తదనంతరం బౌద్ధ సంస్కృతి ఆచారాలు, సంప్రదాయాలు ఇక్కడ వెల్లివిరిసినట్లు తెలుస్తోందన్నారు. విస్తృతంగా పరిశీలనలు జరిపితే ఈ ప్రాంతం చారిత్రక వైభవాన్ని తెలుసుకోవచ్చని, వీటి చిత్రాలను ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు పంపించనున్నట్లు బృంద కన్వీనర్ నూకా సన్యాసిరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment