మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దేశాన్ని కార్పొరేట్ శక్తులు, మతతత్వ శక్తులు పాలిస్తున్నాయని, వాటి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందని సీనియర్ పాత్రికేయుడు, సంపాదకుడు కె.శ్రీనివాస్ అన్నారు. ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అరసవల్లిలోని ఓ కల్యాణ మండపంలో ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంబంధాలు కలిగి ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు పొందడంలో ఘోరంగా విఫలమవుతోందన్నారు.
సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మోదీ సర్కార్ మతోన్మాదంతో రెచ్చిపోతోందని, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో పాలన సాగిస్తూ లౌకికవాద దేశంలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు యువత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ వీసీ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ మాట్లాడుతూ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ అమలు కావాలని, అప్పుడే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ టూరిజం దేశ భవిష్యత్ అంటున్న పాలకులు ఆ పేరుతో గిరిజన ప్రాంతాల్లో కార్పొరేట్ శక్తులు పాగా వేసే ప్రమాదం ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, రాష్ట్ర నాయకులు సీ.హెచ్ గీత, పి. సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు, తిరుమలై రామన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment